ఇసుక దోపిడీ చేసింది చంద్రబాబే: పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy Slams Chandrababu Over His Allegations On Govt - Sakshi

సాక్షి, విజయవాడ: ఇసుకను అడ్డం పెట్టుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. వరద తగ్గిన కారణంగా ఇసుక తీయడం ఎక్కువైందని.. ప్రస్తుతం సగటున రోజుకి లక్షన్నర టన్నుల ఇసుక అందుబాటులో ఉందని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అయినప్పటికీ ఇసుక దీక్ష పేరిట చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని.. ఇందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని చురకలు అంటించారు. ఇసుకపై చంద్రబాబు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి విజయవాడ బందరురోడ్డులో తన క్యాంపు ఆఫీసు సమీపంలో గురువారం ధర్నాకు దిగారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇసుక మాఫియాతో దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబుకు అసలు ఇసుక గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయాన్ని మంత్రి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది. అయితే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వర్షాలు పడ్డాయి. వరదల కారణంగా ఇసుక తీయడం కష్టమైంది. దీంతో చంద్రబాబు ఇసుకపై తప్పుడు రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క ధర్నా జరగనీయలేదు. ఇప్పుడేమో ఇసుకను అడ్డం పెట్టుకుని దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారు. దీక్ష అంటూ నాటకాలు ఆడుతున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకరు. మా పాలనలో ఎక్కడా ఇసుక మాఫియా లేదు. తప్పుడు చార్జిషీటు విడుదల చేసి దుష్ప్రచారం చేయడం సరికాదు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు సాగనివ్వం’ అని చంద్రబాబు తీరును మంత్రి ఎండగట్టారు.

దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా..
చంద్రబాబుది దొంగ దీక్ష అని.. ఆయనను ప్రజలు ఎవ్వరు నమ్మడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అలాంటిది ఆయన దీక్ష చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ‘చంద్రబాబు వేసిన చార్జిషీటు పరమ బోగస్. ఇసుక దోపిడిలో చంద్రబాబుకు ఎన్జీటీ వంద కోట్ల జరిమానా వేసింది. ఇలా దొంగ దీక్షలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావు’ అని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top