పారదర్శకంగా ఇసుక రవాణా

Peddireddy Ramachandra Reddy Comments about Sand transport - Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

రాష్ట్రంలో 400 చెక్‌పోస్ట్‌ల ఏర్పాటుకు సన్నాహాలు

ఇసుకపై ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక రవాణాపై పూర్తిస్థాయి నియంత్రణ ఉండేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో 400 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక విక్రయాలు, రవాణా పూర్తి పారదర్శకంగా జరిగేలా రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఇసుక రీచ్‌ను మంత్రి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తవ్వకాలను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక లారీల యజమానులతో మాట్లాడారు. జీపీఎస్‌తో అనుసంధానం చేసుకోని లారీలను రవాణాకు అనుమతించవద్దని ఆదేశించారు. అనంతరం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

చెక్‌పోస్టుల్లో ఇప్పటికే వంద సిద్ధమయ్యాయని, ప్రతి చెక్‌పోస్టులోనూ రెండు సీసీ కెమెరాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపేలా అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకుని రాబోతున్నామన్నారు.రాష్ట్రంలో ఇప్పటికే రోజువారీ ఇసుక తవ్వకం దాదాపు 4 లక్షల టన్నులకు చేరిందని చెప్పారు. మరో నాలుగైదు రోజుల్లో ఇది 10 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. రోజువారీ సగటు వినియోగం 65 వేల టన్నులు ఉందని చెప్పారు. వచ్చే వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఇసుకను డిపోలు, స్టాక్‌ పాయింట్లలో నిల్వ ఉంచుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 130 ఇసుక రీచ్‌లు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. దీనిలో 102 ఓపెన్‌ రీచ్‌లు ఉన్నాయని అన్నారు. అలాగే 53 డీసిల్టేషన్‌ రీచ్‌లు గుర్తిస్తే, వాటిలో 43 పనిచేస్తున్నాయని, 23 డీకాస్టింగ్‌ పాయింట్లలో కూడా ఇసుక వెలికితీస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 158 స్టాక్‌యార్డ్‌లు 50 ఇసుక డిపోలతో కలిపి మొత్తం 208 ఇసుక విక్రయ కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. 

బాబు హయాంలో యథేచ్ఛగా దోపిడీ
చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగిందని మంత్రి అన్నారు. అయిదేళ్ల కాలంలో ఇసుక ద్వారా చంద్రబాబు ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలను వెనకేసుకువచ్చారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రక్షాళన చేస్తుంటే.. ఎల్లో మీడియాతో ప్రభుత్వంపై బురద చల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఇసుక కొరత అంటూ రాశారని, ఈ రోజు సమస్య పరిష్కారం కావడంతో అక్రమ రవాణా అంటూ తప్పుడు కథనాలను రాస్తున్నారని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top