కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధం

Pawan Kalyan sensational comments on Yellow media - Sakshi

     రియల్‌ అజ్ఞాతవాసి టీవీ9 రవిప్రకాశే.. 

     పొలిటికల్‌ బాస్‌లతో కుమ్మక్కై నా తల్లిని తిట్టించారు

     ఓ వ్యక్తి రవిప్రకాశ్‌ కాళ్లపై పడిన వీడియో ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసిన పవన్‌

సాక్షి, అమరావతి: తన తల్లిని నడిబజారులోకి లాగి తిట్టించడం వెనుక దాగి ఉన్న కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. దీనిపై సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, అతని స్నేహితుడితో పాటు కొన్ని మీడియా సంస్థల వారు తన తల్లిని తిట్టించారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని తన ఇంటి వద్దకు చేరుకున్న అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆవేశపడొద్దని అభిమానులకు సూచించారు. సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ‘వాళ్లు తప్పు చేసి మళ్లీ నా పైనే కేసులు వేస్తున్నారు.

నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయపోరాటం చేస్తాను’ అని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులతో పాటు తాను కూడా నిస్సహాయుడినని వివరణ ఇచ్చారు. ‘వాళ్లు నెలల తరబడి తిట్టి తిట్టి.. ఆఖరికి నా తల్లిని బజారుకీడ్చారు. అలాంటి పరిస్థితిలో నేనంటే అభిమానించే మీకు చిన్నపాటి కోపం రాకూడదా. వాళ్లే ఇష్టమొచ్చినట్టు పచ్చిబూతులు మాట్లాడి.. మీరు నిగ్రహంగా ఉండాలంటే ఎలా? అసలు ప్రేరేపించిన వారు ఎవరు? అయినా కూడా మీరు(అభిమానులు) ఆవేశపడొద్దు. వాళ్లు కుట్రపూరితంగా ఎదురు కేసులు పెట్టి ఇరికిస్తారు. జాగ్రత్తగా ఉండాలి’ అని పవన్‌ సూచించారు. కాగా, ఏబీఎన్, టీవీ9కు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్‌ ట్వీట్ల దాడి రెండో రోజు కూడా కొనసాగింది.

టీవీ9 ప్రతినిధి రవిప్రకాశ్‌ను రియల్‌ ‘అజ్ఞాతవాసి’గా పేర్కొన్నారు. ఆ అజ్ఞాతవాసిని ముఖ్యమంత్రే స్వయంగా.. ‘వాడో బ్లాక్‌మెయిలర్‌’ అంటూ వ్యాఖ్యానించారని విమర్శించారు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలంటూ ఆ టీవీ చానల్‌ ప్రసారం చేస్తోందని.. అసలు ఆ స్లోగన్‌ వెనక కథకు, ఈ నినాదానికి సంబంధమేంటి? నిజాలను నిగ్గుతేల్చుదామంటూ ట్వీట్‌ చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశించి పవన్‌ మరో ట్వీట్‌ చేశారు. తన తల్లిని తిట్టిస్తూ ప్రసారం చేసిన వీడియోను సీఎం చంద్రబాబుతో పాటు లోకేశ్‌కు, మీ కుటుంబంలోని మహిళలకు చూపించాలని రాధాకృష్ణకు సూచించారు.

వారి అభిప్రాయం ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. కాగా, టీవీ9 యజమాని శ్రీనిరాజు పంపించిన లీగల్‌ నోటీస్‌పైన కూడా పవన్‌ స్పందించారు. ‘నీకు శ్రీసిటీతో లబ్ధిచేకూర్చిన నీ పొలిటికల్‌ బాస్‌లతో కుమ్మక్కైన.. మీ చానల్‌ సీఈవో రవిప్రకాశ్‌ నా తల్లిని తిట్టించిన దానికి, నువ్వు పంపిన లీగల్‌ లెటర్‌కు తేడా ఏం లేదు’ అని శ్రీనిరాజును ఉద్దేశించి పవన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, శనివారం రాత్రి రవిప్రకాశ్‌పై పవన్‌ ట్వీట్ల దాడి తీవ్రతరం చేశారు. ఓ వ్యక్తి రవిప్రకాశ్‌ కాళ్ల మీద పడి వేడుకుంటున్నట్లుగా ఉన్న ఓ వీడియోను కూడా పవన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీన్ని కూడా ప్రసారం చేసుకొని మీ చానల్‌ను నడుపుకోండి అంటూ ఎద్దేవా చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top