లోకేష్‌ సీఎం కావాలంటే 60 ఏళ్లు ఆగాలి

Pawan Kalyan Comments On Lokesh - Sakshi

     నిడదవోలులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్య

     చంద్రబాబు వెన్నుపోటుతో కుర్చీ ఎక్కారు

     అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తా

నిడదవోలు: నారా లోకేష్‌ బాబూ.. నువ్వ సీఎం కావాలంటే 60 ఏళ్లు ఆగాలి.. ఎన్టీఆర్‌ చిత్రసీమలో 60 ఏళ్లు కష్టపడిన తరువాత సీఎం అయ్యారు. నేనూ చిత్రసీమ నుంచే వచ్చాను. నేను ప్రజల సమస్యలపై పోరాడుతున్నా.. కష్టపడి సీఎం అయిన ఎన్టీఆర్‌ను నీ తండ్రి చంద్రబాబు వెన్నుపొటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లోకేష్‌పై ఘాటుగా విమర్శించారు. ప్రజా పోరాటయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం గణేష్‌చౌక్‌ సెంటర్‌ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2014లో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు మద్దతిస్తే ప్రత్యేక హోదా సాధించలేకపోయారన్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు అయినా నిడదవోలుకు ఒక్క ఆర్వోబీ నిర్మించలేకపోయారని విమర్శించారు.

రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌తో పాటు టీడీపీ నాయకులంతా చేతకాని దద్దమ్మలని విమర్శించారు. తాము రూపొందించబోయో మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వమే వృద్ధాశ్రమాలను నడిపే విధంగా చూస్తామన్నారు. తాను కోట్లు సంపాదించే సినిమా రంగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తునిలో రైలు తగలబెట్టిన సంఘటనలో అమాయకులపై చంద్రబాబు కేసులు పెట్టారని విమర్శించారు. జగన్‌ కాపుల విషయంలో మాట మార్చారన్నారు.

కాపు రిజర్వేషన్లను రాజ్యాంగంలో 9వ షెడ్యుల్‌లో చేర్చి కేంద్రంతో పోరాటం చేస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు చెందిన పేదలకు రిజర్వేషన్ల కోసం పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇచ్చే కిలో రూపాయి బియ్యాన్ని ఎవరూ తినడంలేదన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశానికి రేషన్‌ బియ్యాన్ని తరలించి టీడీపీ నాయకులు రూ.కోట్లు సంపాదించుకుంటున్నారన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయొద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండండి అంటూ పరోక్షంగా నారా లోకేష్‌ను హెచ్చరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top