
సాక్షి, అమరావతి: ‘ఇది మనం ఎదిగే దశ. మార్పు చిన్నగానే మొదలవుతుంది. ఈ మార్పు ఎంత వరకు వెళ్తుందో తెలియదు. ఎన్నికలు పూర్తయిన వెంటనే వైఎస్సార్‌సీపీ, టీడీపీలు తమకు ఇన్ని స్థానాలు వస్తాయంటూ లెక్కలు వేయడం మొదలుపెట్టాయి. మనం అలా లెక్కలు వేయం. ఓటింగ్ సరళి ఎలా జరిగిందో తెలుసుకోమని మాత్రమే పార్టీ నాయకులకు చెబుతున్నా’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులతో పవన్ సమావేశమయ్యారు. ఈ భేటీకి 15 మంది మాత్రమే హాజరుకావడం గమనార్హం.
పోలింగ్ సందర్భంగా అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సమావేశ వివరాలను పార్టీ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది. ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని పవన్ పార్టీ అభ్యర్థులతో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకువెళ్దామన్నారు. సమావేశంలో నాదెండ్ల మనోహర్, రాజకీయ సలహాదారు రామ్మోహనరావు, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు.