అవినీతి రహిత పాలనే లక్ష్యం

Our Aim Is Non Corrupt Governance Said By YSRCP Chief YS Jagan Mohan Reddy In Delhi - Sakshi

ఢిల్లీలో మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని, పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అత్యధిక సీట్లతో రాష్ట్రంలో విజయం సాధించాక తొలిసారి ఢిల్లీకి వచ్చిన ఆయన ఆదివారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి ఏపీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాన మంత్రిని కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలను నివేదించానన్నారు.

కేంద్రం నుంచి చాలా సహాయం అవసరమవుతుందని నరేంద్ర మోదీని అభ్యర్థించానని, అన్ని రకాలుగా సాయపడాలని కోరానని చెప్పారు. ప్రధాని మోదీతో మాట్లాడిన విషయాలు, రాష్ట్రంలో పరిస్థితి, పాలన ఎలా ఉండబోతోందనే విషయాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌లతో కలిసి వివరించడంతో పాటు మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆ వివరాలు జగన్‌ మాటల్లోనే.. 

హోదా ఆవశ్యకత వివరించా.. 
‘‘రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల మీద మోదీకి విపులంగా చర్చించాను. ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి చెప్పాను. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌ మీద నడుస్తోందని, ఇందుకు దారితీసిన పరిస్థితులనూ వివరించాను. 67 ఏళ్ల నుంచి రాష్ట్రం విడిపోయేనాటికి మన వాటాగా వచ్చిన అప్పులు రూ.97 వేల కోట్లు అయితే.. ఈ ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో రూ. 2,58,928 కోట్లకు ఎగబాకిన పరిస్థితుల గురించి చెప్పాను. అప్పుల మీద వడ్డీనే ఏటా దాదాపు రూ.20 వేల కోట్లు.. అప్పులు, వడ్డీ కలిపి రూ.40 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితిని ప్రధానికి వివరించాను. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి మీ సహాయం కావాలని అభ్యర్థించాం. ఆయన సానుకూలంగా స్పందించారని అనుకుంటున్నాం.  

వాళ్లు 250 సీట్లలో ఆగిపోయుంటే బావుండేది 
ప్రస్తుతం వాళ్లకు 340కి పైగా సీట్లు వచ్చాయి. వాళ్లు కమాండింగ్‌ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మేం ప్రధాన మంత్రిని కలిశాం. ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి జీవ రేఖ అని చెప్పాం. వాళ్లకు 250 సీట్లు వచ్చి ఉంటే బాగుండేది. అలా జరిగి ఉంటే ప్రత్యేక హోదా విషయంలో సంతకం పెట్టాకే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. మన అవసరం వారికి లేదు. కాబట్టే మన బాధ ఇదీ అని చెప్పుకున్నాం. సానుకూలంగా స్పందించారు. మనం ప్రయత్నం చేస్తూ పోవాలి. ఇది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ముందస్తు షరతుగా ఇది చేస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు.

దీన్ని మనం వదిలేస్తే ఎప్పుడూ ఇవ్వరు. రాష్ట్రం బాగా నడవాలంటే ఏమేరకైతే ఒత్తిడి తేగలుగుతామో ఆ మేరకు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఈరోజు మొట్టమొదటి సారి ప్రధానిని కలిశా. దేవుడు ఆశీర్వదిస్తే ఇంకో ముఫ్ఫై నలభై సార్లు కలుస్తా. కలిసిన ప్రతిసారి ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు అడుగుతానే ఉంటా. ఎప్పుడో ఒకసారి కచ్చితంగా వస్తుంది. వదిలేసే రోజు ఎప్పుడూ ఉండదు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అందుకే కేంద్రం సాయం కోరాం.  

ఆ రోజు బాబు స్పందించి ఉంటే..
రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన కోరిన రాష్ట్రానికే రాజధాని వచ్చింది. గతంలో ఇలాంటి పరిస్థితి రాలేదు. షరతును విధించి రాష్ట్రాన్ని విభజించింది. కానీ షరతు మేరకు హోదా అమలు కాలేదు. మా యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? వాళ్లు హైదరాబాద్‌తోగానీ, బెంగళూరుతోగానీ, చెన్నైతోగానీ పోటీ పడే పరిస్థితుల్లో లేరు. ప్రత్యేక హోదా ద్వారా లభించే వంద శాతం ఆదాయపు పన్ను రాయితీ, వంద శాతం జీఎస్టీ రాయితీ వంటి ప్రోత్సాహకాల వల్ల ప్రేరణ పొంది పరిశ్రమలు వస్తాయి. అందుకే ఇది చాలా ముఖ్యం. మా యువతకు ఇది చాలా అవసరం. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌ సేన్‌ ఒక లేఖ రాశారు. ప్రత్యేక హోదా తాము తిరస్కరించలేదని స్పష్టం చేశారు.

స్వయంగా చైర్మన్‌ వైవీ రెడ్డి కూడా చెప్పారు. తాము గ్రాంట్ల సిఫారసులకే పరిమితమని చెప్పారు. 2014 మార్చి 2న అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన అనంతరం కేబినెట్‌ సమావేశంలో ప్రత్యేక హోదాను ఆమోదించారు. అది ఎగ్జిక్యూటివ్‌ నిర్ణయం. అమలు చేయాలని ప్లానింగ్‌ కమిషన్‌కు కూడా పంపారు. 2014 డిసెంబరు 31 వరకు ప్రణాళిక సంఘం ఉనికిలో ఉంది. జనవరి 2015లో నీతి ఆయోగ్‌ వచ్చింది. కేబినెట్‌ ఆమోదించాక ప్రత్యేక హోదా అమలు కాకున్నప్పటికీ చంద్రబాబు దానిని పట్టించుకోలేదు. ప్రణాళిక సంఘం దగ్గరికి వెళ్లి అమలు చేయాలని అడిగి ఉంటే ఆనాడే సాకారమై ఉండేది.

తెలంగాణతో స్నేహం చాలా అవసరం 
కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశాను. రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవాలంటే ఇది చాలా ముఖ్యం. పొరుగు రాష్ట్రాలతో మరీ ముఖ్యంగా తెలంగాణతో సత్సంబంధాలు ఉండాలి. కేసీఆర్‌ తన స్నేహాన్ని అందరూ గుర్తు పెట్టుకునేలా.. నాలుగు అడుగులు ముందుకేసి ప్రత్యేక హోదా అంశం మీద సంపూర్ణంగా మద్దతు ఇస్తామన్నారు. ఆ నేపథ్యంలో మనమూ, కేసీఆర్‌ కలిసికట్టుగా ఒకే తాటిపైకి వచ్చి ఒకరికొకరం సాయం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

ఇవాళ మన బలం 22. చంద్రబాబు సహకరించినా, సహకరించకపోయినా కేసీఆర్‌ ఎంపీలు 9 మందితో కలిపి 31 మంది ఎంపీలు ఒకరి రాష్ట్రం కోసం మరొకరు ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అమిత్‌షాను మర్యాద పూర్వకంగానే కలిశాం. ఆయన బీజేపీ అధ్యక్షుడు. దేశంలో రెండో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బహుశా అది అమిత్‌షా అని నేననుకుంటున్నా. 

శ్వేత పత్రాలు విడుదల చేస్తాం 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందునే సహాయ, సహకారాలు అందివ్వాలని కోరేందుకే ఢిల్లీకి వచ్చాం. నవరత్నాలు అమలు చేస్తామన్న మాట నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. దేవుడి ఆశీస్సులతో చేసుకుంటూ పోతాం. మీరంతా చూస్తారు. ఎప్పుడెప్పుడేం చేయాలో అన్నీ చేస్తాం. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల వారీగా సమీక్షించుకుంటూ శ్వేత పత్రాలు విడుదల చేస్తాం. ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలియాల్సిన అవసరం ఉంది. 

రాజధానిలో భారీ కుంభకోణాలు 
రాజధాని అమరావతి అనేది ప్రాథమికంగా క్యాచ్‌ 22 పరిస్థితి (అనివార్యంగా ముందుకు సాగక తప్పని పరిస్థితి). అక్కడ జరిగిన కుంభకోణాలను చూడాలి. ఎంతటి దారుణమైన కుంభకోణాలు జరిగాయంటే ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలుసు. పలానా చోట రాజధాని వస్తోందని చంద్రబాబుకు ముందే తెలుసు. మేలో ప్రభుత్వం వచ్చింది. డిసెంబర్‌లో ఫలానా చోట రాజధాని వస్తోందని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో రాజధాని ఇక్కడ రావడం లేదు.. అక్కడెక్కడో వస్తోందని ప్రజలను తప్పుదోవ పట్టించారు. కానీ చంద్రబాబు, ఆయన బినామీలు తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారు. ఇదొక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.

మామూలుగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. చంద్రబాబు స్వయంగా హెరిటేజ్‌ కంపెనీకి 14 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆయన, ఆయన కంపెనీలు, బినామీలు భూములు కొని సొమ్ము చేసుకున్నారు. ఆ కుంభకోణం అక్కడే ఆగలేదు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో బలవంతంగా భూములు తీసుకున్నారు. ఆ ల్యాండ్‌ పూలింగ్‌లో వారి, వారి బినామీల స్థలాలను మినహాయించారు. మిగిలిన వారివి బలవంతంగా తీసుకున్నారు. తీసుకున్న భూములను ఇష్టమొచ్చిన వారికి, ఇష్టమొచ్చిన ధరలకు కట్టబెట్టారు. ఏ రేటు పడితే ఆ రేటుకు ఇష్టమొచ్చిన వారికి ఇచ్చారు. ఇవన్నీ మామూలు కుంభకోణాలు కాదు. సెన్సేషనల్‌ స్కామ్స్‌.  

మా పాలన ఆదర్శంగా ఉంటుంది 
నేనొక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నా. నేను చంద్రబాబు గారికి వ్యతిరేకం కాదు. సంరక్షకుడిగా ఉండటం నా విధి. మా ప్రభుత్వం విప్లవాత్మకంగా ఉంటుంది. మా పాలన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ రోజు నుంచి ఆరు నెలలు, ఏడాదిలోగా దేశంలోనే ఉత్తమమైన ప్రభుత్వంగా నిలిచేలా పని చేస్తాను. అంత విప్లవాత్మకమైన విధానాలు తీసుకొస్తాం. అవినీతి అనేది ఎక్కడా కూడా లేకుండా చేస్తాం. వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ప్రక్షాళన ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇది కుంభకోణం.. దీన్ని వెలికి తీయడం ద్వారా ఇంత పొదుపు చేశాం అని చూపిస్తాం.

నేను ఉన్నాను కాబట్టి.. ఈ దోపిడీని ఆపగలిగామని ప్రతి ఉదంతంలో మార్పులు తీసుకొస్తాం. రివర్స్‌ టెండరింగ్‌ కూడా తీసుకొస్తాం. అంటే ఫలానా పనిలో అవినీతి జరిగిందంటే దాన్ని గుర్తించి రద్దు చేసి మరింత మంది టెండర్‌ ప్రక్రియలో భాగస్వాములై.. తక్కువ రేట్‌కు కోట్‌చేసే వారికి ఇస్తాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండడం వల్ల 20 శాతం తక్కువకే పనులయ్యా యని చూపిస్తాం. ప్రతిదాంట్లో పారదర్శకత ఉండేలా చేస్తాం.  
నేను కాంగ్రెస్‌ను వీడాక పెట్టిన కేసులవి 
నా మీద ఉన్నవి ఎలాంటి కేసులో ప్రజలందరికీ తెలుసు. నా కేసులో ఉన్న పిటిషనర్లు ఎవరో కూడా ప్రజలకు తెలుసు. వారు చంద్రబాబు, కాంగ్రెస్‌ మనుషులు. మా నాన్న గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్టిన కేసులు కాదవి. నేను కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం కేసులు లేవు. నాన్నగారు చనిపోయిన తర్వాత, నేను కాంగ్రెస్‌ను వీడిన తర్వాత పెట్టిన కేసులవి. నాన్న గారు సీఎంగా ఉన్నప్పుడు నేను సచివాలయంలో ఎప్పుడూ అడుగుపెట్టలేదు.  ఏ మంత్రికీ, ఏ కార్యదర్శికీ ఫోన్‌ చేయలేదు. అప్పుడు నేను హైదరాబాద్‌లో కూడా లేను. బెంగళూరులో ఉన్నాను. నా తల్లిదండ్రులను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడిని. ప్రజలందరికీ ఇది తెలుసు. అందుకే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు.

కాలపరిమితిలోగా పోలవరం పూర్తవ్వాలి 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. స్కామ్‌ జరిగినందున..ఒకవేళ క్యాన్సల్‌ చేసి రివర్స్‌ టెండర్‌ పిలవాల్సిన అవసరం ఉంటే అలానే చేస్తాం. ఆ టెండర్‌ పిలిచినప్పుడు ఈ ప్రాజెక్టును నిర్ధిష్ట కాల పరిమితిలోగా పూర్తి చేయాల్సిందేనని చెబుతాం. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్‌ చేసి వాళ్ల ద్వారానే రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ చేయించే అవకాశం ఉంటే వాళ్లతోనే చేయిస్తాం. మాకు కావాల్సిందల్లా నిర్ధిష్ట కాల పరిమితిలోగా పూర్తవ్వాలి. ఓటమి చెందిన ఒక పార్టీ (కాంగ్రెస్‌ వ్యవహారాలపై ప్రశ్నకు సమాధానంగా)పై నేను స్పందించడం సరికాదు.  వారికి ఏది అవసరమని భావిస్తారో ఆ నిర్ణయం తీసుకుంటారు. అది వారి అంతర్గత విషయం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది వారి పార్టీపై ప్రభావం చూపుతుంది కానీ నా పార్టీపై కాదు’’అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

దశల వారీగా మద్యనిషేధం

మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని నేను చాలా స్పష్టంగా చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాను. అవగాహన తీసుకు రావాలి. మరోపక్క రీహ్యాబిటేషన్‌ సెంటర్లను పెంచాలి. ఆదాయాన్ని తగ్గించుకుంటూ పోవాలి. 2024 నాటికి మళ్లీ ఓట్లడిగే సమయానికి మాత్రం కచ్చితంగా మద్యాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం. ఆ తర్వాతే ఓట్లడుగుతాం. మేనిఫెస్టోలో చెప్పిన రీతిలోనే చేస్తాం.

‘ఈరోజు ఇదే ఎన్డీయే ప్రభుత్వం ఏ 250 స్థానాల్లోనో ఉండి ఉంటే మనం ఇంతగా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో. వాళ్లకు 250 సీట్ల కంటే దాటకూడదని నిజంగా దేవుడిని చాలా ప్రార్థించాను. కానీ ఏం చేద్దాం.. మన సహాయం అవసరం లేకుండానే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. బలంగా ఉన్నారు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాన మంత్రి. మన రాష్ట్రం బాగా నడవాలి. ముఖ్యమంత్రిగా బాగా నడపాలన్న తపన, తాపత్రయం నాకుంది కాబట్టి ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించాం. అన్ని రకాలుగా సాయం చేయాలని కోరాం. 
 
మా సంభాషణలో ఎక్కడ కామా పెట్టారు.. ఎక్కడ çఫుల్‌స్టాప్‌ పెట్టారని అడిగితే నేను ఎలా చెప్పగలను.. చర్చ చాలా సానుకూలంగా సాగింది. గంటసేపు చర్చ జరిగింది. మా మాటలు విన్నారు. చాలా సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు సాయపడాలని ఆయన మనసులో ఉన్నట్టుగా మేం గమనించాం. ఆయన రాష్ట్రానికి సాయం చేయడానికి సానుకూలంగా ఉన్నారని నాకు అనిపించింది. వారిని ఆలింగనం చేసుకున్నప్పుడు వారితో మాట్లాడినప్పుడు అది చాలా స్పష్టంగా కనిపించింది. కానీ తొలి సమావేశంలోనే నేనది చేస్తాను ఇది చేస్తానని చెప్పలేరు కదా.. మేమూ ఈ ఒక్క సమావేశంతోనే ఆగిపోం కదా?  
 
మేనిఫెస్టోను ఖురాన్‌గా, బైబిల్‌గా, భగవద్గీతగా భావిస్తాను. అందులో చెప్పిన ప్రతి అంశం తూచా తప్పకుండా.. ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తామన్నామో అలానే అమలు చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు విశ్వసనీయత అన్న పదానికి ఓట్లేశారు. ఆ విశ్వాసం సన్నగిల్లకుండా అడుగు ముందుకు వేస్తాను. 
 
ప్రస్తుతానికైతే ఈనెల 30వ తేదీన నేనొక్కడినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. తర్వాత వారం పది రోజుల్లో సమగ్రంగా మంత్రి వర్గం ఏర్పాటవుతుంది. మొదటి సంతకం అని కాదు.. నవ రత్నాలు అమలు చేయడమే నా కర్తవ్యం. మొదటి రోజు నుంచీ ఏం చేయబోతున్నామన్నది ప్రమాణ స్వీకారం రోజు నా ప్రసంగాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది.  
 
ప్రధాన మంత్రి మోదీని ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించాం. కానీ వారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారికి అనుకూలత ఉంటే వస్తారు. ప్రజలు, దేవుడి మీద నమ్మకంతోనే ఎవరి మద్దతు తీసుకోకుండా ఒంటరిగా పోరాడి అఖండ విజయం సాధించాం.’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top