క్లీన్‌చిట్‌ను ఒకరు వ్యతిరేకించారా?

One election commissioner dissented on two decisions - Sakshi

మోదీపై ఈసీ 2:1 మెజారిటీతో నిర్ణయం తీసుకుందా?

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మహారాష్ట్రలో గత నెలలో చేసిన రెండు ఎన్నికల ప్రసంగాలకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో ఒకరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారా? ఈ పరిణామాలపై అవగాహన కలిగిన అత్యున్నత స్థాయి వర్గాలు అవుననే అంటున్నాయి. మోదీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ చేసిన అనేక ఫిర్యాదులపై సీఈసీ సునీల్‌ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్‌ గత మూడురోజుల్లో తన నిర్ణయాలను వెలువరించింది.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఏప్రిల్‌ 1న వార్దాలో మోదీ చేసిన ప్రసంగానికి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ఎన్నికల కమిషనర్లలో ఒకరు వ్యతిరేకించారు. ఆరోజు ప్రధాని.. మైనారిటీలు ఎక్కువగా ఉండే వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేయడంపై విమర్శలు గుప్పించారు. అలాగే ఏప్రిల్‌ 9న లాటూర్‌లో పుల్వామా, బాలాకోట్‌ ఘటనలను ప్రస్తావిస్తూ తొలిసారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వీటిపై పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్‌ 2:1 మెజారిటీతో నిర్ణయం వెలువరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏదైనా ఒక అంశంపై భిన్నాభిప్రాయం వక్తమైనప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘ చట్టం–1991 చెబుతోంది.  

విపక్షం తెలివితక్కువ ఆరోపణలు
ఎన్నికల సంఘంపై విపక్షం తెలివితక్కువ ఆరోపణలు చేస్తోందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ విమర్శించారు. ఈసీ వ్యవహారాల్లో బీజేపీ ఏ విధంగానూ జోక్యం చేసుకోవడం లేదన్నారు. టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో.. ఎమ్మెల్యేలను కొనేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఒకవేళ ఇతర పార్టీల నేతలు వివిధ కారణాల రీత్యా బీజేపీలో చేరాలనుకుంటే మాత్రం అడ్డుకోవడంలో అర్ధం లేదని పీటీఐతో అన్నారు. కాంగ్రెస్‌ వంటి విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పారు. ఈసీపై బీజేపీకి అపారమైన గౌరవ మర్యాదలున్నాయని సింగ్‌ అన్నారు.

మరో రెండింట్లో క్లీన్‌చిట్‌
న్యూఢిల్లీ: వారణాసి, నాందేడ్‌ల్లో చేసిన రెండు ప్రసంగాల సందర్భంగా ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని, కానీ తమ సూచనలు కానీ ఉల్లంఘించలేదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో మాట్లాడిన మోదీ.. కాంగ్రెస్‌ను మునుగుతున్న టైటానిక్‌తో పోల్చారు. రాహుల్‌ గాంధీ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి కేరళలోని వయనాడ్‌ సీటును ఎంచుకున్నారని విమర్శించారు. వారణాసిలో భద్రతా బలగాలను, ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. వీటిపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వీటితో పాటు కాంగ్రెస్‌ చేసిన ఐదు ఫిర్యాదులను పరిష్కరించిన ఈసీ.. అన్ని విషయాల్లో మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top