కుల భేటీలపై మంత్రులకు నోటీసులు

కేటీఆర్, ఈటల, మహమూద్‌ అలీ వివరణ కోరిన రజత్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: కుల, మత, వర్గాల వారీగా ఓట్ల ను అభ్యర్థించారనే ఫిర్యాదుపై రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, కె.తారకరామారావు, ఈటల రాజేందర్‌ల నుంచి సంజాయిషీ కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌ శుక్రవారంనోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తోపాటు ప్రజాప్రాతినిధ్యం చట్టాన్ని ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలుపుతూ 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు.

కాంగ్రెస్‌ నేతలు మధుయాష్కీగౌడ్, నిరంజన్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. మంత్రులు కేటీఆర్‌ మంగళవారం నగరంలో దివ్యాంగులతో,  మహమూద్‌ అలీ మిర్యాలగూడలో ముస్లింలతో, ఈటల జమ్మికుంటలో నాయీబ్రాహ్మణులతో నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈ వో ఆదేశించారు.  ఇంటెల్‌ కంపెనీ అధిపతితో నిర్వహించిన భేటీలో కేటీఆర్‌తో కలసి పాల్గొన్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌కు, ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుపై సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌కూ సీఈవో నోటీసులు జారీ చేశారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top