మహాకూటమిలోకి జేడీయూ?

Nitish Kumar To Return To Mahaghatbhandan - Sakshi

పట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్‌ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తిరిగి మహాకూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆర్జేడీ నేత, ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌పై అవినీతి అరోపణలు కారణంగా గత ఏడాది మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్‌.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమిలో నితీష్‌ ఇమడలేకపోతన్నారని.. బీజేపీకి స్వస్తి చెప్పి తిరిగి కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమిలో చేరతారని సమాచారం. 

గతకొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై నితీష్‌ పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభ సీట్ల పంపకం విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఎన్డీఏ నుంచి బయటకు వస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్జేడీ ఛీప్‌, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఇటీవల నితీష్‌ కుమార్‌ ఫోన్‌ చేయడంతో బిహార్‌ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్డీఏ నుంచి నితీష్‌ బయటకు వస్తే మహాకూటమిలోకి తిరిగి ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు ప్రకటించారు. ఈ విషయంపై తేజస్వీ యాదవ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నితీష్‌ను తిరిగి మహాకూటమిలోకి తిరిగి రానిచ్చేదిలేదని తేల్చిచెప్పారు. నితీష్‌కు మహాకూటమి తలుపులు ఎప్పుడో మూసుకుని పోయాయని ఇటీవల తేజస్వీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఇటీవల సమావేశమై చర్చించారు. నితీష్‌ ప్రస్తుతం ఫాసిస్టు పార్టీతో కలిసి ఉన్నారని, వారి నుంచి బయటకు వస్తే మిత్రపక్షాలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని బిహార్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఎస్‌కే గోయల్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top