మోదీ హవా; మట్టికరిచిన మహామహులు

Nearly Dozen Former CMs Swept Away In Saffron Wave - Sakshi

న్యూఢిల్లీ : ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ అంటూ నినదించిన నరేంద్ర మోదీ నామస్మరణలో యావత్‌ భారతావని ఉప్పొంగిపోయింది. జయహో మోదీ అంటూ రెండోసారి ఆయనకు పట్టం కట్టింది. తద్వారా వరుసగా రెండోసారి ప్రధాని పదవి అలంకరించనున్న కాంగ్రెసేతర వ్యక్తిగా ఆయన సరికొత్త చరిత్ర లిఖించనున్నారు. ఈ క్రమంలో ప్రజాభిమానం దండిగా చూరగొన్న మోదీ మేజిక్‌తో విపక్షాలన్నీ కుదేలయ్యాయి. ఆయన నేతృత్వంలోని బీజేపీ కూటమికి ఏకంగా 349 సీట్లు రాగా... బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించి సత్తా చాటింది. దీంతో విపక్షాలన్నీ పత్తా లేకుండా పోయాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ దఫా కూడా కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేక చతికిలపడింది. రాజస్తాన్‌, గుజరాత్‌, హరియాణా, ఢిల్లీలో క్లీన్‌స్వీప్‌ చేసిన మోదీ హవాలో డజనుకు పైగా మాజీ ముఖ్యమంత్రులు కొట్టుకుపోయారు. హేమాహేమీలుగా ఘనతకెక్కినా ఈ ఎన్నికల్లో ఓటమి పాలై చేదు అనుభవాన్ని చవిచూశారు. ఇక ఇందులో కాంగ్రెస్‌కు చెందిన వారే ఎనిమిది ఉండటం గమనార్హం. మట్టి కరిచిన కొంతమంది మహామహుల గురించి ఓసారి గమనిద్దాం.

షీలా దీక్షిత్‌
మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు. ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగిన ఆమె.. బీజేపీ అభ్యర్థి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ చేతిలో దాదాపు మూడున్నర లక్షల ఓట్లకు పైగా తేడాతో పరాజయం చెందారు. కాగా గత ఎన్నికల్లో ఢిల్లీ ఎంపీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీ.. ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.

దేవెగౌడ, మాజీ ప్రధాని
మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ ఓటమితో కర్ణాటకలో అధికార పార్టీలకు గట్టి షాక్‌ తగిలింది. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్‌ నియోజకవర్గాన్ని మనవడు ప్రజ్వల రేవణ్ణ కోసం త్యాగం చేసిన దేవెగౌడ.. ఈసారి తుముకూరు నుంచి పోటీ చేశారు. గురువారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి జీఎస్‌ బసవరాజ్‌ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. కాంగ్రెస్‌- జేడీఎస్‌తో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గానూ 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ క్రమంలో జేడీఎస్‌ కురువృద్ధుడు దేవెగౌడ కూడా మట్టికరిచారు. గత ఆరు పర్యాయాలుగా(ఉప ఎన్నికలు సహా) హసన్‌లో గెలిచిన ఆయన.. తొలిసారి తుముకూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

దిగ్విజయ్‌ సింగ్‌
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారు. భోపాల్‌ నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ చేతిలో మూడున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన సాధ్వి ప్రఙ్ఞాకు 8.6 లక్షల ఓట్లు రాగా, అపార అనుభవం ఉన్న దిగ్విజయ్‌కు కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక గురువారం వెలువడిన ఫలితాల్లో 29 స్థానాలకు గానూ కేవలం ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకోగా.. బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తద్వారా ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికల ఫలితం పునరావృతమైంది. (1977 ఎన్నికల్లో అవిభాజ్య మధ్యప్రదేశ్‌లో భారతీయ జనసంఘ్‌ 39 సీట్లు సంపాదించుకోగా.. కాంగ్రెస్‌ ఒక్క సీటుకే పరిమితమైంది).

అశోక్‌ చవాన్‌
మహారాష్ట్రలోని నాందేడ్‌ నియోజకవర్గ ప్రజలు  కాంగ్రెస్‌కు గట్టి షాక్‌నిచ్చారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ సీఎం, సిట్టింగ్‌ ఎంపీ అశోక్‌ చవాన్‌ బీజేపీ అభ్యర్థి ప్రతాప్‌రావు చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన టికెట్‌పై గెలిచిన ప్రతాప్‌రావు.. ఈ దఫా బీజేపీ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.

సుశీల్‌ కుమార్‌ షిండే
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ షిండే.. బీజేపీ అభ్యర్థి సిద్ధేశ్వర్‌ శివాచార్య చేతిలో ఘోర పరాజయం చెందారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి ఎన్నికల బరిలో దిగిన ఆయన దాదాపు లక్షన్నర ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ మునిమనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేశారన్న సంగతి తెలిసిందే. ఈయన బరిలోకి దిగిన కారణంగా కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లకు గండి పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హరీశ్‌ రావత్‌
ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ బీజేపీ అభ్యర్థి అజయ్‌ భట్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. నైనితాల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన..దాదాపు 3 లక్షల తేడాతో ఓడిపోయారు.దీంతో ఈ స్థానంలో కచ్చితంగా గెలిచి తీరతామని భావించిన కాంగ్రెస్‌ ఆశలు గల్లంతయ్యాయి.

ముకుల్‌ సంగ్మా
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత ముకుల్‌ సంగ్మాకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్‌పీపీ అభ్యర్థి అగాథా సంగ్మా చేతిలో దాదాపు 3 లక్షల ఓట్ల తేడాతో ఆయన పరాజయం చవిచూశారు.

భూపేందర్‌ సింగ్‌ హుడా
హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేందర్‌ సింగ్‌కు కూడా ఓటమి తప్పలేదు. సోనిపట్‌ నుంచి ఎన్నికల బరిలో దిగిన ఆయన.. దాదాపు లక్షన్నర ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేశ్‌ చందర్‌ కౌశిక్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా 200-14 మధ్య సీఎంగా పనిచేసిన భూపేందర్‌ సింగ్‌ ప్రస్తుతం ఘరీ సాంప్లా కిలోయ్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ఆయనకు.. ఈ ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

వీరప్ప మొయిలీ
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. చిక్కబళ్లాపూర్‌ నుంచి పోటీ చేసిన ఆయన..బీజేపీ అభ్యర్థి బీఎన్‌ బచ్చేగౌడ చేతిలో దాదాపు ఐదున్నర లక్షల ఓట్ల తేడాతో భారీ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న వీరప్ప ఓటమి కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది.

బాబులాల్‌ మరాండి
మాజీ సీఎం, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా అభ్యర్థి బాబూలాల్‌ మరాండి ఈ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఆయన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణా దేవి  4 లక్షల తేడాతో భారీ విజయం సాధించారు. జార్ఖండ్‌ తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన ఆయన.. 2006లో బీజేపీ నుంచి బయటకు వచ్చారు.     

ఇక జమ్ము- కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తి కూడా ఈ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ప్రత్యర్థి చేతిలో ఓటమి చెందారు. అనంతనాగ్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన ఆమె.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన జస్టిస్‌ హస్నేన్‌ మసూదీ చేతిలో పది వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top