అధికార యంత్రాంగంతో విపక్షాల అణచివేత

Narendra Modi using government machinery to intimidate opposiyion - Sakshi

ప్రధాని మోదీ వైఖరిని ఎండగట్టిన మమతా బెనర్జీ

రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని ఆరోపణ

జల్పాయిగురి/ఫలాకటా: ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రధాని మోదీ  ప్రభుత్వం సంస్థలను, అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తమ కేబినెట్‌ కార్యదర్శిని గానీ, హోం శాఖ కార్యదర్శిని గానీ ఎందుకు తొలగించడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం(ఈసీ) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆమె ‘రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది? ఏపీ చీఫ్‌ సెక్రటరీని ఎందుకు తొలగించారు? అని నిలదీశారు. ‘మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కుటుంబంపై దాడులు చేయించారు. ఏపీ సీఎంపైనా దాడి చేయించారు.

ఆదాయపన్ను శాఖ, సీబీఐ అధికారులను, సంస్థలను బీజేపీ ప్రభుత్వం స్వార్థం కోసం వాడుకుంటోంది’ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో అధికారుల తొలగింపుపై ఆమె స్పందిస్తూ.. ‘ఓటమి భయంతోనే వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారు ఎంతగా అధికారులను మారిస్తే, అంతగా మాకు విజయావకాశాలు మెరుగవుతాయి’ అని అన్నారు. తనను చూసి మమతా భయపడుతున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘నిజానికి నన్ను చూసి మోదీ భయపడుతున్నారు. నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూస్తే, అంతగా ఎదురు తిరిగి గర్జిస్తాం. ఈ దీదీ ఎవరికీ, దేనికీ భయపడేది కాదు’ అని తీవ్ర స్వరంతో అన్నారు. ప్రధాని మోదీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదనీ, కనీసం రాష్ట్రం పేరును కూడా మార్చేందుకు అనుమతివ్వలేదని ఆరోపించారు.

మాకు పూర్తి అధికారాలున్నాయి: ఈసీ
మమతా విమర్శలపై ఈసీ స్పందించింది. స్పెషల్‌ పోలీస్‌ పరిశీలకులు, ఇతర ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకే అధికారులను మార్చినట్లు తెలిపింది. ఎన్నికల నిబంధనావళి మేరకు ఈ విషయంలో తమకు పూర్తి అధికారాలున్నాయని స్పష్టం చేసింది. తొలగించిన స్థానాల్లోనూ సమర్థులైన అధికారులను నియమిస్తున్నట్లు పేర్కొంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top