ఒకరి ఆస్తి 660కోట్లు మరొకరి ఆస్తి రూ.1,823

Nakul Nath Richest Among MP Candidates in Fray for Phase 4 Poll - Sakshi

ఎన్నికలంటేనే కోట్ల రూపాయల వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో పట్టుమని పదివేలు కూడా లేకుండా ఎన్నికల బరిలో దిగడం  సాహసమే అనాలి. లేదా తెలివి తక్కువతనమనాలి. మధ్య ప్రదేశ్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఇలాంటి నిరుపేదలు ఉన్నారని  ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) విశ్లేషణలో తేలింది.ఈ ఎన్నికల్లో కోటీశ్వరులతో పాటు పేదలు, నిరక్షరాస్యులు కూడా పోటీ చేస్తున్నారు. సిద్ధి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న లలన్‌ కుమార్‌ ఆస్తి కేవలం 1,823 రూపాయలు. రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న 104 మందిలో ఈయనే కడు పేదవాడని ఏడీఆర్‌ పేర్కొంది. అలాగే,ఇక్కడ నుంచే బరిలో దిగిన మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థి రాం సహాయ్‌ ఆస్తి 6,134 రూపాయలు. కాగా జబల్‌పూర్‌ అభ్యర్థి ధనుక్‌ పరిస్థితి వీరిద్దరికంటే కొంచెం మెరుగు.ఆయన ఆస్తి విలువ 10,300 రూపాయలు.

ఇక కోటీశ్వరుల విషయానికి వస్తే, చింద్వారా కాంగ్రెస్‌ అభ్యర్థి నకుల్‌ నాథ్‌(సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు) ఆస్తి 660 కోట్లు. జబల్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ తన్‌ఖా 66 కోట్ల ఆస్తిపరుడు. సిద్ధి కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ సింగ్‌కు 37కోట్ల విలువైన ఆస్తిపాస్తులున్నాయని ఏడీఆర్‌ తెలిపింది.వివేక్‌ తన వార్షికాదాయం 11 కోట్ల రూపాయలని ఇన్‌కంట్యాక్స్‌ రిటర్న్స్‌లో పేర్కొంటే, నకుల్‌ 2 కోట్లుగా పేర్కొన్నారు.
మొత్తం 104 మంది అభ్యర్థుల్లో 14శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 17శాతం మంది తమపై క్రిమినల్‌ కేసులున్నాయని అఫిడవిట్‌లలో తెలిపారు. అభ్యర్థుల్లో 41 మంది డిగ్రీ ఆపై చదువులు చదివారు. 55 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరు అసలు చదువుకోలేదు. మరో నలుగురికి చదవడం, రాయడం వచ్చు. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎక్కువగా యువకులనే బరిలో దింపాయని ఏడీఆర్‌ తెలిపింది. మొత్తం అభ్యర్థుల్లో 60శాతం పాతిక నుంచి 50 ఏళ్ల లోపు వారే ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు(షాదోల్, సిద్ధి, జబల్‌పూర్, మాండ్లా, బాలాఘాట్, చింద్వారా)కు ఏప్రిల్‌ 29న పోలింగు జరుగుతుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top