
మిలినీయర్ అంటే.. వారు ఎలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లగ్జరీ వాహనాల నుంచి విశాలమైన భవనాల వరకు.. విలాసవంతగా ఉండేలా చూసుకుంటారు. కొంతమంది ధనవంతులు మరింత ప్రత్యేకంగా ఉండటం కోసం ఖరీదైన ప్రైవేట్ జెట్‌లను ఉపయోగిస్తారు. ఈ కథనంలో ప్రముఖ భారతీయుల అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌ల గురించి తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ - బోయింగ్ 737 మ్యాక్స్9
బోయింగ్ 737 మ్యాక్స్9 అనేది భారతదేశంలోని ఖరీదైన విమానాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. బోయింగ్ 737 మ్యాక్స్9 ఎగిరే ప్యాలెస్ లాంటిది. దీని లోపల మాస్టర్ బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ వంటివన్నీ ఉన్నాయి. 19 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ ప్రైవేట్ జెట్ ధర రూ. 1000 కోట్ల కంటే ఎక్కువని సమాచారం.
విజయ్ మాల్యా - ఎయిర్‌బస్ ఏ319
భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా కూడా ఖరీదైన ప్రైవేట్ జెట్ కలిగి ఉండేవారు. 2012 నుంచి ఆర్థిక కుంభకోణాలు.. వివాదాలలో చిక్కుకున్న మాల్యా, ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈయన వద్ద ప్రస్తుతం ఈ జెట్ లేదని తెలుస్తోంది. కానీ ఇది 18 మంది ప్రయాణికులు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక బార్, డైనింగ్ ఏరియా, బెడ్‌రూమ్ వంటివి కలిగిన ఈ జెట్ ధర రూ. 700 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.
అమితాబ్ బచ్చన్ - బాంబార్డియర్ ఛాలెంజర్ 300
బాలీవుడ్ నటుడు.. కౌన్ బనేగా కరోడ్‌పతి హోస్ట్ అమితాబ్ బచ్చన్ వద్ద 'బాంబార్డియర్ ఛాలెంజర్ 300' ఉంది. ఈ జెట్ విశాలమైన క్యాబిన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. దీని ధర రూ. 220 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.
రతన్ టాటా - డస్సాల్ట్ ఫాల్కన్ 2000
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'రతన్ టాటా' డస్సాల్ట్ ఫాల్కన్ 2000 విమానం ఉపయోగించేవారు. ఇందులో విలాసవంతమైన సదుపాయాలు అందుబాటులో ఉండేవి. ఈ జెట్ ధర రూ. 300 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.
అదార్ పూనవాలా - గల్ఫ్‌స్ట్రీమ్ G550
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవాలా.. వద్ద గల్ఫ్‌స్ట్రీమ్ G550 అనే ఖరీదైన విమానం ఉంది. దీని విలువ రూ. 500 కోట్ల కంటే ఎక్కువే. ఇది చాలా స్టైలిష్ జెట్. అదార్ పూనవాలా తన అభిరుచికి తగిన విధంగా దీనిని నిర్మించుకున్నారు.