దీదీకి చాలా అహంకారం : మోదీ

Modi Dares Mamata Banerjee To Arrest Him For Saying Jai Shri Ram - Sakshi

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచార కార్యక్రమాల్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేం‍ద్ర మోదీ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేసే వారిని మమతా బెనర్జీ అరెస్ట్‌ చేయించి.. జైలులో పెడుతున్నారని మోదీ ఆరోపించారు. ఒక వేళ తాను ‘జై శ్రీరాం’ అంటే.. దీదీ తనను కూడా అరెస్ట్‌ చేయిస్తుందని మోదీ పేర్కొన్నారు.

మూడు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఎన్నికల ప్రచారానికి వెళ్తోన్న దీదీ కాన్వాయ్‌ను అడ్డుకుని ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు మమతా. దీనిపై స్పందిస్తూ.. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. ‘ప్రస్తుతం దీదీ చాలా చిరాగ్గా ఉన్నారు. ఇప్పుడు ఆమె ముందు దేవుడి పేరు ఎత్తినా తప్పే. ప్రధాని కావాలనేది దీదీ కోరిక. కానీ ఆమె కల నెరవేరదు. బెంగాల్‌లో ఆమె 10 సీట్లు కూడా గెలవద’న్నారు మోదీ.

అంతేకాక ‘దీదీకి దేశం పట్ల కొంచెం కూడా ప్రేమ లేదు. ఇప్పటి వరకూ దేశాన్ని పొగుడుతూ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆఖరికి మసూద్‌ అజర్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడలేదు. అలా మాట్లాడితే.. ఆమె ఓటు బ్యాంక్‌ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అందుకే దీని గురించి ఆమె ఎక్కడా ప్రస్తావించలేద’న్నారు మోదీ. అంతేకాక ఫొని తుపాను గురించి ఆరా తీయడానికి తాను దీదీకి ఫోన్‌ చేశానన్నారు మోదీ. కానీ తనతో మాట్లాడ్డానికి ఆమెకు అహంకారం అడ్డువచ్చిందన్నారు. అందుకే తన కాల్స్‌ అటెండ్‌ చేయలేదన్నారు మోదీ. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దీదీ.. గడువు తీరిన ప్రధానితో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top