రగులుతున్న మేయర్‌-కార్పొరేటర్ల పోరు! | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 14 2018 2:31 PM

 mlc buddha venkanna meets vijayawada corporators - Sakshi

సాక్షి, విజయవాడ: నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తలెత్తిన అసమ్మతిపోరు ఇంకా సద్దుమణగలేదు. నోటి దురుసుతో అందరినీ బూతులు తిడుతున్న మేయర్‌ శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని స్వపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లతో పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుధవారం సమావేశమయ్యారు.

మేయర్ శ్రీధర్‌ను తప్పించాల్సిందేనని ఈ సమావేశంలో కార్పొరేటర్లు బుద్దాను డిమాండ్ చేశారు. రొటేషన్ పద్ధతిలో మేయర్ పీఠాన్ని వేరేవారికి అప్పగించాలని కోరారు. మేయర్ ను తప్పించడమనేది తన పరిధిలో లేదని, మీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్న బుద్దా కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు. ఈ వివాదంపై చర్చించేందుకు మధ్యాహ్నం మేయర్‌ శ్రీధర్‌తో ఎమ్మెల్సీ బుద్దా సమావేశం కానున్నారు.

ఈ రోజు సమావేశానికి ముగ్గురు మినహా కార్పొరేటర్లంతా హాజరయ్యారని, మేయర్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్పొరేటర్లు తనకు ఫిర్యాదు చేశారని బుద్ధా మీడియాతో తెలిపాఈరు. సమన్వయలోపంతోనే మేయర్, కార్పొరేటర్లు మధ్య వివాదం తలెత్తిందని, మధ్యాహ్నం మేయర్‌తో సమావేశమై.. అందరినీ కలుపుపోవలని ఆయనకు సూచిస్తామని బుద్ధా పేర్కొన్నారు. మిగతా కులాల వారికి రొటేషన్ పద్ధతిలో చైర్మన్ పదవి ఇవ్వాలని కార్పొరేటర్లు కోరుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఇతర ప్రాంతాలలో ప్రభావం..
విజయవాడ మేయర్‌ను మారిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న అధికార పార్టీ మేయర్లపై పడుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల రెండేళ్లకు ఒకరు మేయర్‌గా ఉండాలన్న ఒప్పందాలు అమలుకాక పార్టీలో అంతర్గత కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్‌ శ్రీధర్‌ను మారిస్తే ఒప్పందాన్ని ఉల్లంఘించి కొనసాగుతున్న తమ మేయర్లను కూడా మార్చాలని, ఇతర ప్రాంతాలలోని ఆశావహులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని  భావిస్తుంది.

Advertisement
Advertisement