ఎమ్మెల్యే టిక్కెట్‌ పీఆర్‌కే! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే టిక్కెట్‌ పీఆర్‌కే!

Published Sat, Jan 5 2019 1:37 PM

MLA Ticket Confirm To Rama Subba Reddy In Jammalamadugu TDP - Sakshi

సాక్షి ప్రతినిధి కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జమ్మలమడుగు పంచాయతీకి తెరపడినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్‌ నాకు కావాలంటే నాకు కావాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పట్టుపట్టారు. దీంతో పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. ఇద్దరితో మాట్లాడాలని మధ్యవర్తిగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఇద్దరికి మూడురోజులు గడుపు ఇచ్చి పంపారు. మూడు రోజులు పూర్తికావడంతో శుక్రవారం తిరిగి విజయవాడలో సీఎంతో భేటీ అయ్యేందుకు నాయకులు గురువారం రాత్రి వెళ్లారు. ఒకదశలో తమకే అసెంబ్లీ టిక్కెట్‌ కావాలని భీష్మించుకున్నారు. చివరకు సీఎం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపైనే మొగ్గుచూపినట్లు తెలిసింది. దీంతో మంత్రి వర్గీయులు డైలమాలో పడ్డారు. దశాబ్దాలుగా కడప పార్లమెంట్‌ స్థానం వైఎస్‌ కుటుంబీకులకే జిల్లావాసులు కట్టబెడుతూ వస్తున్నారు.వారిని ఢీకొనేందుకు మంత్రి ఆది ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డిని, ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డిలను ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటూ కోరారు. ఓడిపోయే స్థానంలో తాము పోటీ చేయలేమంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో మంత్రి డైలమాలో పడ్డారు. ప్రొద్దుటూరు టిక్కెట్‌ తనకుమారుడు సుధీర్‌రెడ్డికి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని అడిగినట్లు తెలుస్తోంది.

డైలమాలో మంత్రి ఆది అనుచరులు...
ఇంతకాలం దేవగుడి కుటుంబాన్ని నమ్ముకుంటూ వచ్చిన మంత్రి అనుచరులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. వైఎస్సార్‌సీపీని వదిలి టీడీపీలోకి వెళ్లిన మంత్రి బాటలోనే నాయకులు, కార్యకర్తలు నడిచారు.ప్రస్తుతం భిన్నపరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని గెలిపించాలంటూ ఎలా ప్రచారం చేయాలని మదనపడుతున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో తమ ఉనికి కొల్పోవాల్సి వస్తుందని నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement