‘ఆ పూజారి కొబ్బరి చిప్పల్ని కూడా వదల్లేదు’

MLA Ambati Rambabu Critics Kodela Siva Prasad Over Furniture Missing - Sakshi

సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోని ఫర్నీచర్‌, కంప్యూటర్లు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం అంబటి మీడియాతో మాట్లాడుతూ... ‘అసెంబ్లీని దేవాలయంగా భావిస్తా. అక్కడ పూజారిగా మాత్రమే ఉన్నానంటున్న కోడెల చివరికి కొబ్బరి చిప్పలను కూడా ఎత్తుకుపోయారు. తన కుమారుడు, కుమార్తెను పూజారులుగా నియమించారు. వస్తువుల్ని దొంగిలించి దొరికిపోయిన తర్వాత.. వాటిని తిరిగి ఇచ్చేస్తున్నామంటున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఇప్పటికే రాష్ట్రం విడిచి పారిపోయారని వార్తలొస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్ని తప్పుగా చిత్రీకరించారని అంబటి మండిపడ్డారు. ‘రాజధానిని అమరావతిలో కట్టొద్దని శివరామకృష్ణన్ చెప్పిన విషయాన్ని మాత్రమే బొత్స ప్రస్తావించారు. అంతేగాని రాజదానిని మార్చుతారని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆ రెండు పత్రికలు వాటి ఇష్టమొచ్చినట్లు రాసుకున్నాయి. అమరావతి, పోలవరంపై చేస్తున్న ప్రచారాలను నమ్మొద్దు. రాజధాని, పోలవరం, అన్న క్యాంటీన్‌లలో టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు కాజేశారు’అని అంబటి విమర్శలు గుప్పించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top