చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే రైతులకు సమస్యలు : కన్నబాబు

Ministers Kannababu And Anil Kumar Yadav Press Meet - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే రైతులకు విత్తనాల సమస్య వచ్చిందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విత్తనాల కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వంలో పక్కదారి పట్టించారని ఆయన విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి రైతులకు విత్తనాల పంపిణీపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 లక్షల 41వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం ఉండగా.. 3 లక్షల 8 వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసినట్టు తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. తక్షణమే కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రైతు ఆత్మహత్యల నివారణకు కృషి​చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 

అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు తనయుడు లోకేశ్‌ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్‌ ట్వీట్‌లు ఆయనే చేస్తున్నారో.. ఎవరైనా రాస్తున్నారో తెలియదన్నారు. గోదావరి నీటితో రాయలసీమ కరువును తొలగించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచన అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే టీడీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రులు కృషి​ చేస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీలో తర్వాతి నాయకుడు ఎవరని వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top