‘ఆ ఎమ్మెల్యేలకు బంపర్‌ ఆఫర్‌’ | Sakshi
Sakshi News home page

‘అసంతృప్త ఎమ్మెల్యేలకు అమాత్య యోగం’

Published Sun, Jul 7 2019 3:32 PM

Ministerial Berths Offered To Dissenting MLAs   - Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలో పాలక జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ను ఇరకాటంలో పడేసిన 11 మంది అసంతృప్త ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెబెల్‌ ఎమ్మెల్యేలు తమ రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు వారికి సంకీర్ణ సర్కార్‌లో మంత్రి పదవులను ఆఫర్‌ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలోకి చేరకుండా నిరోధించేందుకు కాంగ్రెస్‌ నేతలు డీకే శివకుమార్‌, మల్లికార్జున ఖర్గే సహా అధిష్టాన పెద్దలు సైతం రంగంలోకి దిగారు.

ముంబైలోని సోఫిటెల్‌ హోటల్‌లో బసచేసిన కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఎహెచ్‌ విశ్వనాధ్‌, రమేష్‌ జర్కిహోలి, సోమశేఖర్‌, రామలింగారెడ్డి, ప్రతాప గౌడ పాటిల్‌, గోపాలయ్య, బీసీ పాటిల్‌, మహేష్‌ కుంతహల్లి, నారాయణ గౌడ, బసవరాజ్‌, శివరాం హెబ్బర్‌లతో ఆ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు పాలక సంకీర్ణ సర్కార్‌ సంక్షోభంలో పడటంతో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం సాయంత్రానికి బెంగళూర్‌కు చేరుకోనున్నారు. ఇక సంకీర్ణ సర్కార్‌ స్ధానంలో అసంతృప్త ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. రెబెల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన ముంబై హోటల్‌లో ఆ పార్టీ నేత ప్రహ్లాద్‌ జోషీ కనిపించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.

Advertisement
Advertisement