చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ

Merugu Nagarjuna Slams Chandrababu Calls Him Anti Dalith - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఆయన పాలనలో గిరిజనులు, దళితులు హాయిగా గుండె మీద చేయి వేసుకుని అంబేడ్కర్ ఆలోచనలతో ఆనందంగా గడుపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సంతోషం కలిగించాయన్నారు. 2018-19లో ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు, ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు కేటాయిస్తే.. 2019-20లో ఎస్సీలకు 11205.41 కోట్లు, ఎస్టీలకు 3669.42 కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. 

ఇక 2020-21 నాటికి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్ల కేటాయింపుతో ఇప్పటి వరకు 77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి చేకూరగా.. మొత్తంగా 1,01,82,319 మందికి లబ్ధి పొందనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీలు, ఎస్టీల సంక్షేమం కోసం సీఎం జగన్‌ పాటుపడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తన వందిమాగదులను అడ్డుపెట్టుకుని విమర్శలకు దిగుతున్నారని మేరుగ మండిపడ్డారు.(అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్‌)

చంద్రబాబు దళిత ద్రోహి
‘‘కాల్మనీ సెక్స్ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చినపుడు ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు స్మృతివనంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. అప్పటికి ఇంకా ఆయనకు నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నా ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు దళిత ద్రోహి. ఆయన హయాంలో దళితులు అవమానానికి గురయ్యారు. దళిత స్త్రీలు వివస్త్రలయ్యారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి విజయవాడలో 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. దేశమంతా అంబెడ్కర్ విగ్రహం వైపు చూసే విధంగా తీర్చిదిద్దనున్నారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఇవేమీ పట్టవు. అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య లాంటి వారిని పెట్టుకుని చంద్రబాబు సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. దళిత వ్యతిరేక విధానాలపై మేము చర్చకు సిద్ధం. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న దళితులకు సిగ్గు లేదు. అయ్యన్నపాత్రుడు లాంటి వారితో ప్రత్యేక భూమిక పోషిస్తూ చంద్రబాబు విశాఖ లో అరాచకాలు సృష్టిస్తున్నారు’’ అని మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top