అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్‌

Published Fri, Jul 17 2020 2:11 PM

YS Jagan Mohan Reddy Meeting About SC and ST Development - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం జరిగింది. దీనికి మంత్రులు పి.విశ్వరూప్, తానేటి వనిత, ధర్మాన కృష్ణదాసు, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని సహా వివిధ శాఖల సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం సీఎం ఎనలేని కృషి చేశారని మంత్రులు ప్రశంసించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు మేలు చేకూర్చారు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 

ఎస్టీ, ఎస్సీల కోసం ఖర్చు చేసిన మొత్తం
2018-19లో ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలానే 2019-20లో ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది (2020-21)కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి పొందగా.. మొత్తంగా 1,01,82,319 మందికి లబ్ధి చేకూరిందని అధికారుల సీఎం జగన్‌కు తెలిపారు. 

మహిళా సాధికారిత కోసమే ఈ రెండు పథకాలు..
సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘మన ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చాం. ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచే. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మేలు జరిగితే అంత మంచిది. ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలు అవుతున్నాయి. దాంతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంది. వైయస్సార్‌ ఆసరా కింద కనీసం 25లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. వైయస్సార్‌ చేయూత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్తోమత పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మహిళల స్వయం సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయి. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సీఎం జగన్‌ తెలిపారు.

వచ్చే అంబేడ్కర్‌ జయంతి నాటికి పార్కు నిర్మాణం పూర్తి
ఆయన మాట్లాడుతూ.. ‘2021 ఏప్రిల్‌ 14, అంబేడ్కర్‌ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యం నెరవేరాలి. అంబేడ్కర్‌ పార్కును వేగంగా పూర్తి చేయాలి. పార్కు పనులను రెండు విభాగాలుగా విభజించాలి. విగ్రహ నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులను రెండుగా విభజించాలి. 20 ఎకరాల్లో విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. అద్భుతంగా, అందంగా, ఆహ్లాదంగా పార్కును తీర్చిదిద్దాలి. వచ్చే ఏప్రిల్‌ 14 నాటికి పార్కు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాలి. విజయవాడ నగరానికి పార్కు తలమానికం కావాలి. మంత్రులు, అధికారులు సవాల్‌గా తీసుకుని అంబేడ్కర్‌ జయంతి నాటికి పూర్తయ్యేలా చూడాలి. వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి’ అని సీఎం జగన్‌‌ అధికారులకు సూచించారు. వీలైనంత కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విజయవాడ బ్యూటీని పెంచేందుకు ఈ పార్కు చాలా ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ అన్నారు.

Advertisement
Advertisement