మోదీపై సర్ధార్జీ విసుర్లు | Manmohan Singh Claimed That The Modi government Has Reversed The Success Of The UPA Government | Sakshi
Sakshi News home page

మోదీపై సర్ధార్జీ విసుర్లు

May 7 2018 1:19 PM | Updated on Aug 15 2018 2:40 PM

Manmohan Singh Claimed That The Modi government Has Reversed The Success Of The UPA Government - Sakshi

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రధాని నరేంద్ర మోదీ (జోడించిన చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దేశాన్ని వారి ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వ విజయాలను మోదీ సర్కార్‌ మరుగుపరుస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు ప్రధాని కార్యాలయాన్ని మోదీ ఉపయోగించుకున్నంతగా మరే ప్రధాని ఉపయోగించలేదని, ఇది ప్రధాని పదవిని దిగజార్చడమేనని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. మోదీ తీరు దేశానికి ఏమాత్రం మంచిది కాదని హితవుపలికారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని, ఇవి దేశానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నా సగటున 7.8 శాతం వృద్ధి రేటు సాధించామని, ఎన్‌డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా తక్కువ వృద్ధిరేటు సాధిస్తోందని అన్నారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశంలో వేలాది ఉద్యోగాలు కోల్పోయామని మన్మోహన్‌ సింగ్‌ ఆరోపించారు. సమర్థవంతమైన నాయకత్వం ఉద్యోగావకాలను సృష్టిస్తుందని, వాటిని నాశనం చేయదని మోదీపై మండిపడ్డారు. మోదీ పథకాలు పేర్లు బాగున్నా వాటి అమలు తీరు అద్వాన్నంగా ఉందని ఆరోపించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరాయని అన్నారు. అధిక ఎక్సయిజ్‌ సుంకాలతో మోదీ ప్రభుత్వం ప్రజలపై పెట్రో భారాలు మోపుతోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement