‘దమ్ముంటే నన్ను తొలగించండి.. ఈసీకి సవాల్‌’

Mamata banerjee Challenge To Election Commission - Sakshi

కోల్‌కత్తా: ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహర తీరుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నలుగురు ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మమత ఘాటుగా స్పందించారు. ఈసీ కేవలం అధికారులను మాత్రమే తొలగిస్తోందని, దమ్ముంటే తనను పదవి నుంచి తొలగించాలని సవాలు విసిరారు. పలువురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేయడంపై మమత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన ఓ బహిరంగ సభలో మమత మాట్లాడుతూ.. కేంద్రం, ఈసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మంచి అధికారులుగా గుర్తింపుపొందిన వారిని బదిలీ చేయడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోందని మమత ఆరోపించారు. యూపీలో ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల బదిలీలపై బీఎస్పీ అధినేత మాయావతి కూడా ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలువురు అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటున్న విషయం విధితమే.

కోల్‌కత్తా సిటీ పోలీస్‌ కమిషనర్‌గా అనూజ్‌ శర్మను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో రాజేష్‌ కుమార్‌ను నియమించింది. 1991 బ్యాచ్‌కు చెందిన అనూజ్‌ శర్మ ఇటీవల కోల్‌కత్తా పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే బిధాన్‌ నగర్‌ కమిషనర్‌, బిర్భం జిల్లా, డైమండ్‌ హార్భర్‌ ఎస్పీలను కూడా తొలగించింది. వీరి స్థానంలో నటరాజన్‌ రమేష్‌ బాబు, అవణ్ణు రవింద్రనాథ్‌, శ్రీహరి పాండేలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలియజేస్తూ లేఖ రాసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top