టీఆర్‌ఎస్‌తోనే యువతకు భవిత | Laxma reddy about kcr | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తోనే యువతకు భవిత

Oct 1 2018 2:35 AM | Updated on Oct 1 2018 2:35 AM

Laxma reddy about kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌తోనే యువతకు భవిష్యత్తు ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలతోపాటు యువత కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పటికే కేజీ టు పీజీ విద్యతోపాటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల మెరుగు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల యువ నేతలు, కార్యకర్తలు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు.

లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లల్లో తెలంగాణలో పేదరికం దూరం అవుతుందని, అప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయని, తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం సుభిక్షం గా మారుతుందన్నారు. గతంలో వివిధ పార్టీల్లో ఉన్నందువల్ల యువకులు కొందరు ఉద్యమంలో పాల్గొనలేక పోయారని, అలాంటి వాళ్లంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే గెలిపిద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు.

ఒకప్పుడు ఊళ్లకు వెళితే ప్రజలు మాకేమిస్తారని అడిగేవారని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు డబ్బులు ఎదురు ఇస్తూ, ఓటు వేస్తామని ప్రమాణాలు చేస్తున్నారని, ఏకగ్రీవ తీర్మానాలు చేసి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 2009లో కేసీఆర్‌ దీక్ష చేసిన సమయంలో యూ టర్న్‌ తీసుకుని అనేక మంది ఉసురు పోసుకున్న చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ గుజరాత్‌ కంటే తెలంగాణలో ఆర్థిక ప్రగతి అద్భుతంగా ఉందంటూ ప్రధాని మోదీ పార్లమెంట్‌లోనే చెప్పారన్నారు. కార్యక్రమంలో నాటక అకాడమీ చైర్మన్‌ బద్మీ శివకుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement