చివరి నిమిషమే..కీలకం!

Last minute itself crucial in polling - Sakshi

‘వంద అడుగులు బోరు వేస్తే నీళ్లు పడతాయని తెలిసి 99 అడుగుల వద్ద ఆపేస్తే ఎలా సార్‌?’ ఇటీవలి హిట్‌ సినిమా డైలాగ్‌ ఇది. ఈ మాట ఎన్నికలకు కూడా వర్తిస్తుంది. పోలింగ్‌ ముందు వరకు విస్తృతంగా ప్రచారం చేసి.. చివరి రోజు ఆదమరుపుతో ఉంటే ఫలితం గల్లంతవుతుందని అనేక సందర్భాల్లో సుస్పష్టమైంది. అందుకే చివరి నిమిషంలో నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదనే సూత్రాన్ని అన్ని పార్టీలూ మదిలో పెట్టుకుని ముందుకెళ్తున్నాయి.  

ప్రస్తుతం దేశంలో సెమీ ఫైనల్స్‌గా చెప్పుకునే ఐదు రాష్ట్రాల ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. ఓ పక్క మోదీ, మరోపక్క రాహుల్‌ సుడిగాలి పర్యటనలు చేస్తూ విజయం కోసం శ్రమిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను తాజా ఎన్నికలు గణనీయంగా ప్రభావితం చేస్తాయని అంచనా. అందుకే ఎలాగైనా ఈ రాష్ట్రాల్లో విజయం సాధించాలని పార్టీలు కష్టపడుతున్నాయి. అందుకోసం చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ యత్నాలు చేస్తున్నాయి. తొలిదశ కంటే.. మలిదశలో ప్రచారంలో ఎక్కువ శ్రమించిన పార్టీకి విజయం దక్కుతున్నట్లు ఇప్పటివరకున్న లెక్కలు చెబుతున్నాయి. ఓటు ఎవరికి వేయాలని ముందుగా నిర్ణయించుకునే వారికంటే.. చివరి నిమిషంలో స్పష్టతకు వచ్చే వారే ఎక్కువగా ఉంటారు. అందుకే చివరి దశలో ఉధృతంగా ప్రచారం చేయడం బాగా కలిసొస్తుందని విశ్లేషకులంటున్నారు.   

మలిదశ ప్రచారమే కీలకం 
ఎన్నికల్లో ఆఖరు దశ ప్రచారం ఎంత కీలకమనే విషయమై లోతుగా అధ్యయనాలు జరిగాయి. మలిదశ ప్రచారం భారత ఎన్నికల్లో చాలా ప్రధానమని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధనల్లో భాగంగా దేశీయ ఓటర్లను మూడు రకాలుగా విభజించారు. వీరిలో మూడో కేటగిరీ ఓటర్లే గెలుపోటములను తారుమారు చేస్తుంటారని వివిధ సందర్భాల్లో రుజువైంది. మొత్తం ఓటర్లలో రెండవ, మూడవ కేటగిరీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని పరిశోధన తెలిపింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం గతంలో ఎక్కువగా ఉండేదని పరిశోధన వెల్లడించింది. గతంతో పోలిస్తే 2014లో లాస్ట్‌ మినిట్‌ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. 1999లో దాదాపు 55%మంది మూడో కేటగిరీ ఓటర్లుండగా, 2014కు వచ్చేసరికి వీరి సంఖ్య 27%కి తగ్గింది. ఈ సంఖ్య తక్కువవుతున్నప్పటికీ.. ఇప్పటికీ వీళ్లని విస్మరించలేమని రాజకీయ పరిశీలకులంటున్నారు. 

విజయం వైపే మొగ్గు 
గెలుపు గుర్రాలకే ఆదరణ ఎక్కువ. చివరి నిమిషం ఓటర్లు కూడా గెలిచేందుకు అవకాశం ఉన్నవారినే ఆదరిస్తారు. ఈ అంశాన్ని గత అధ్యయనాలు వివరిస్తున్నాయి. అందుకే ప్రచారంలో పార్టీలు ప్రజల్లో సెంటిమెంట్‌ను రేకెత్తించి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తుంటాయి. తాము గెలుపునకు దగ్గరగా ఉన్నామని ఓటర్లలో సెంటమెంట్‌ రాజేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఓటర్ల మైండ్‌ తమకు అనుకూలంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాయి. ఇదంతా చివరి నిమిషం ఓటర్లను ప్రభావితం చేయడంలో వ్యూహమే. వీటి కారణంగానే.. ఈ చివరి నిమిష ఓటర్లు గెలిచే అవకాశం ఉన్న పార్టీకే ఓటేస్తారని పరిశోధన వెల్లడిస్తోంది. ఉదాహరణకు 2014లో ఎందుకు ఫలానా పార్టీకి ఓటేశారు? అనే విషయమై సర్వే చేస్తే ఎలాగూ గెలుస్తారన్న అంచనాతో సదరు పార్టీకి ఓటేశామని సర్వేలో 43% మంది చెప్పారు.  గత లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీ విజయం సాధిస్తారని చాలామంది భావించారు. ఈ భావనే చివరినిమిషం ఓటర్లను ప్రభావితం చేసింది. గెలుపు గుర్రానికి ఓటేశామనేవారిలో కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి 18% మెజార్టీ లభించింది. 

48% ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిన ఓటర్లు, వీళ్లు ఆయా పార్టీల కార్యకర్తలై ఉంటారు. ఈ ఓట్లపై పార్టీలకు అవగాహన ఉంటుంది.
25% ప్రచార సమయంలో నిర్ణయం తీసుకునే ఓటర్లు, ఎన్నికల హామీలను చూసి నిర్ణయం తీసుకుంటారు. 
27% చివరి నిమిషం ఓటర్లు, ఓటింగ్‌పై ఆసక్తి తక్కువగా ఉన్న ఓటర్లు. చివరి నిమిషంలో హఠాత్తుగా ఓటేయాలని డిసైడవుతుంటారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top