
గవర్నర్‌కు ఆ అధికారం లేదు : కుమారస్వామి
బెంగళూర్ : కర్ణాటకలో రాజకీయ హైడ్రామాకు తెరపడలేదు. కుమారస్వామి సర్కార్ బలపరీక్షపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్న క్రమంలో సభ సోమవారానికి వాయిదా పడింది. బలపరీక్షను తక్షణమే చేపట్టాలని బీజేపీ పట్టుబట్టగా గందరగోళం మధ్యే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. బలపరీక్షను చేపట్టాలన్న గవర్నర్ సూచనను తోసిపుచ్చడం పట్ల బీజేపీ నేత యడ్యూరప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వాస పరీక్షను వెంటనే నిర్వహించాలన్న బీజేపీ డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్ రమేష్ కుమార్ విశ్వాస తీర్మానంపై ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడాలని చెప్పారు.
మరోవైపు కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠ రేపుతుండగా బలపరీక్షపై అంతకుముందు గవర్నర్ ఇచ్చిన మరో డెడ్‌లైన్‌పై సీఎం కుమారస్వామి మండిపడ్డారు. బలపరీక్షను తక్షణమే ఎదుర్కోవాలని తనకు గవర్నర్ రాసిన లేఖను లవ్ లెటర్‌గా ఆయన అభివర్ణించారు. విశ్వాస పరీక్షపై చర్చ ఎలా సాగాలనేదానిపై గవర్నర్ నిర్ధేశించలేరని స్పష్టం చేశారు. గవర్నర్ ఆదేశాలు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్వర్వులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో బలపరీక్షపై నిర్ణయాన్ని తాను స్పీకర్‌కే వదిలివేస్తున్నానని, సభ నడిపే తీరును ఢిల్లీ శాసించలేదని, గవర్నర్ పంపిన లేఖ నుంచి తనను కాపాడాలని కోరుతున్నానని స్పీకర్‌ను ఉద్దేశించి కుమారస్వామి అన్నారు.
గవర్నర్‌కు తాను గౌరవం ఇస్తానని, అయితే ఆయన నుంచి తనకు వచ్చిన రెండో లవ్ లెటర్ తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయం గవర్నర్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని కుమారస్వామి ప్రశ్నించారు. కాగా బలపరీక్షపై శుక్రవారం సాయంత్రం ఆరు గంటల్లోగా ఓటింగ్ చేపట్టాలని గవర్నర్ వజూభాయ్ వాలా స్పీకర్‌కు మరో డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే.
విశ్వాస పరీక్షలో చేతబడిపై చర్చ
అసెంబ్లీలో సాయంత్రం ఆరు గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ విధించిన రెండో డెడ్‌లైన్ కూడా ముగిసింది. విశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాతే ఓటింగ్ చేపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు సభలోకి రేవణ్ణ నిమ్మకాయలతో వచ్చారని బీజేపీ ఆరోపించింది. చేతబడులతో ప్రభుత్వాలు నిలబడతాయా అని కుమారస్వామి బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. విశ్వాస పరీక్షలో చేతబడిపై చర్చ ఆసక్తికరంగా సాగింది.