కొలువుదీరిన కుమారస్వామి కేబినెట్‌

Kumaraswamy expands Cabinet with induction of 25 Ministers - Sakshi

కాంగ్రెస్‌కు 15, జేడీఎస్‌కు 8 పదవులు

బీఎస్పీ, కేపీజేపీకి ఒక్కోటి

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్‌ నేతలతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం రూపొందించిన తన కేబినెట్‌లో మొత్తం 25 మందికి చోటు కల్పించారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. జేడీఎస్‌ నుంచి 8 మందికి, కాంగ్రెస్‌ నుంచి 15 మందికి, బీఎస్పీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష(కేపీజేపీ)లకు ఒక్కోటి చొప్పున పదవులు కల్పించారు. జేడీఎస్‌తో బీఎస్పీ ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకోగా, సంకీర్ణ సర్కారుకు కేపీజేపీ మద్దతు పలికింది. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఎంబీ పాటిల్, దినేశ్‌ గుండూ రావు, రామలింగ రెడ్డి, ఆర్‌.రోషన్‌ బైగ్, హెచ్‌కే పాటిల్, శ్యాంనూర్‌ శివశంకరప్ప, తన్వీర్‌ సేఠ్, సతీశ్‌ జార్ఖిహోలిలకు ఈసారి అవకాశం దక్కలేదు.

సీఎం వర్గానికి పెద్దపీట..
కుమారస్వామి సామాజికవర్గం ఒక్కలిగలకు మంత్రివర్గంలో పెద్దపీట దక్కింది. మొత్తం 9 మంది ఒక్కలిగలు, నలుగురు లింగాయత్‌లు, ముగ్గురు దళితులు, ముగ్గురు మైనార్టీలు, ఇద్దరు– కురుబలు, ఈడిగ, ఉప్పర, గిరిజన తెగ, బ్రాహ్మణ కులాల నుంచి ఒక్కొక్కరికి స్థానం లభించింది. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్దరామయ్యను ఓడించిన జేడీఎస్‌ నాయకుడు జీటీ దేవెగౌడ, కుమారస్వామి సోదరుడు రేవణ్ణలకు కేబినెట్‌లో చోటు దక్కింది. కాంగ్రెస్‌ నుంచి ప్రమాణం చేసిన వారిలో డీకే శివకుమార్, కేజే జార్జ్, ఆర్వీ దేశ్‌పాండే, ప్రియాంక్‌ ఖర్గే, ఆర్‌బీ పాటిల్‌ తదితరులున్నారు. బీఎస్పీ, కేపీజేపీలకు ఉన్న ఏౖకైక ఎమ్మెల్యేలు వరసగా ఆర్‌ఏ మహేశ్, ఆర్‌. శంకర్‌లకు కేబినెట్‌ బెర్తులు దక్కాయి. ఈ కేబినెట్‌లో అలనాటి నటి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జయమాల ఏకైక మహిళా మంత్రి కాగా, 83 ఏళ్ల మనాగుళి(జేడీఎస్‌) అత్యంత పెద్ద వయస్కులు. కొత్త మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది.

అసంతృప్తుల నిరసనలు..  
మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు హెచ్‌కే పాటిల్‌ బెంగళూరులోని చాళుక్య సర్కిల్‌లో 200 మంది మద్దతుదారులతో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన్వీర్‌ సేఠ్‌‡ అభిమానులు కూడా మైసూరులో నిరసనకు దిగారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్‌ కూర్పు చేసేటప్పుడు ఇలాంటి అసంతృప్తులు రావడం సహజమేనని అన్నారు. సంయమనంతో ఉండాలని, అందరికీ న్యాయం చేస్తాననని హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top