నడ్డా.. అబద్ధాల అడ్డా  | KTR Slams BJP Working President JP Nadda | Sakshi
Sakshi News home page

నడ్డా.. అబద్ధాల అడ్డా 

Aug 20 2019 1:05 AM | Updated on Aug 20 2019 4:50 AM

KTR Slams BJP Working President JP Nadda - Sakshi

హైదరాబాద్‌ : బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా చెప్పినవన్నీ అసత్యాలేనని, అబద్ధాలకు అడ్డాగా ఆయన నామకరణం సార్థకం చేసుకున్నారని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రాంతమన్నా, ఇక్కడి ప్రజలన్నా గౌరవంలేదని, రాజకీయ లబ్ధి కోసమే కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఇప్పటివరకు ఆ పార్టీలు రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో చెప్పాలని సవాల్‌ విసిరారు. సోమవారం కూకట్‌పల్లి ఎన్‌. గార్డెన్‌లో జరిగిన నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక నిధులు రాలేదని, చట్టబద్ధంగా రాష్ట్రాలకు వచ్చే నిధులే వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. భక్వాస్‌ స్కీమ్‌ అన్నారు. ఆసరా పథకం కింద కేంద్రం రూ.200 కోట్లు ఇచ్చి అంతా తామే ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, అందులో కేంద్రం వాటా పప్పు ఉడికిన తర్వాత ఉప్పువేసిన చందంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పథకాలు తీసుకొచ్చి ప్రజా సంక్షేమానికి నిరంతరం శ్రమపడుతున్నారన్నారు.  

ఇక్కడి పథకాలు కాపీ... 
రాష్ట్రం చేపట్టిన పలు పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందన్నారు. రైతు బంధు పథకాన్ని పీఎం కిసాన్‌ యోజనగా మార్చారన్నారు. మిషన్‌ భగీరథను గర్‌ గర్‌ జల్‌ పేరుతో అమలుచేస్తున్నారన్నారు. ఈ పథకాలను ఎన్నికల ముందు తీసుకొచ్చారని తెలిపారు. సెంటిమెంట్‌ పేరుతో దేశ ప్రజలను బీజేపీ మభ్యపెడుతుందని విమర్శించారు. 70 ఏళ్లుగా తెలంగాణ ప్రజల కష్ట్రాలను కాంగ్రెస్, బీజేపీ పట్టించుకోలేదని, రాష్ట్రం వచ్చిన తర్వాతే తమ ప్రాంతంతో అభివృద్ధి జరుగుతోందన్న విషయాన్ని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ చేస్తున్న విషప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు వెళ్లి పార్టీని అంతర్గతంగా బలోపేతం చేయాలని సూచించారు. 

తెలంగాణకు ఎన్నో ప్రశంసలు... 
కమీషన్‌ కాకతీయ అని, అక్రమాల భగీరథ అంటూ విమర్శలు చేసే బీజేపీ నాయకులు.. ఏం అక్రమాలు జరిగాయో కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చూపించాలన్నారు. వారి ఆధీనంలోని నీతి ఆయోగ్‌ ఇప్పటివరకు తెలంగాణ చేస్తున్న అభివృద్ధికి ఎన్నో ప్రశంసలు అందించిందన్నారు. మిషన్‌ భగీరథను, కాకతీయను ప్రశంసించి ప్రధానికి నివేదిక అందించడం జరిగిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పథకాలపై, తెలంగాణలోని సంక్షేమ పథకాలపై వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా, రైతు బంధు, ఆరోగ్యశ్రీతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలకు అవసరమయ్యే పథకాలను అమలు చేస్తోందన్నారు. అంతేకాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా ప్రత్యేక పథకాలను అమలు చేయనుందన్నారు.  

కృష్ణారావుకు అభినందన.. 
రాష్ట్రంలోనే కూకట్‌పల్లి నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీ మొదలు నియోజకవర్గ కమిటీల వరకు ఏర్పాటు చేసి భారీ యెత్తున కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందంజలో నిలిచిన ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావును కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. క్రమశిక్షణకు కూకట్‌పల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పెట్టనికోటగా నిలుస్తారని కొనియాడారు. అనంతరం మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల పని అయిపోయిందని టీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీలు కె. నవీన్‌రావు, సుంకరి రాజులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement