ఢిల్లీ జుట్టు మనచేతిలోనే.. 

KTR Comments In Election Campaign At Nalgonda - Sakshi

16 మంది ఎంపీలు గెలిస్తే 

మందబలం ఉన్నవారిదే మాట 

బీజేపీకి 150.. కాంగ్రెస్‌కు 80 సీట్లు మించి దాటవు 

నల్లగొండ రోడ్‌ షోలో కేటీఆర్‌  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  ‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఫెడరల్‌ ఫ్రంటే.. 16 మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతిలోనే ఉంటుంది..’అని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం నల్లగొండలో ఆయన రోడ్‌ షోలో పాల్గొన్నారు. అనంతరం క్లాక్‌టవర్‌ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బీజేపీలో ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ సాధించిన మొదట్లో ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపారు. అప్పుడు చంద్రబాబు చేతిలో ఎంపీల సంఖ్య ఎక్కుగా ఉండటం.. బాబు అవసరం మోదీకి ఎక్కువగా ఉండటంతో రాత్రికి రాత్రే బలవంతంగా ఆ ఏడు మండలాలను ఆం«ధ్రాలో కలిపేసుకోగలిగారు. అదే 16 మంది ఎంపీలను టీఆర్‌ఎస్‌ గెలిపించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం మనం చెప్పినట్టు వింటుంది..’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం బలం ఎవరికి ఉందో.. వారిదే రాజ్యం అన్న విధంగా పరిస్థితి తయారైందని చెప్పారు.

మంద బలం ఉన్నవారి మాట నెగ్గుతుందనడానికి .. కేంద్రంలో ఎవరు రైల్వే మంత్రిగా ఉంటే వారి రాష్ట్రాలకే రైళ్లు పరుగులు పెట్టాయి తప్ప నల్లగొండకు రాలేదన్నారు. మమత బెనర్జీ ఉంటే పశ్చిమ బెంగాల్‌కు, లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఉంటే బిహార్‌కు, ఆయన అత్తగారింటికి కూడా వెళ్లాయన్నారు. మోదీ ప్రధానిగా బుల్లెట్‌ రైలు గుజరాత్‌కే పరుగులు పెడుతుంది తప్ప, నల్లగొండకు కాదన్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికలు దేశం దశను మార్చేవని, కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం.. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి లాభం అవుతుందని కేటీఆర్‌ వివరించారు.  

ఇన్నేళ్లు ఎందుకు అభివృద్ధి చేయలేదు? 
నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిస్సిగ్గుగా జాతీయ పార్టీలతోనే అభివృద్ధి అంటున్నాడని, 71 ఏళ్ల స్వతంత్ర భారతంలో 55 ఏళ్లు కాంగ్రెస్, 14 ఏళ్లు బీజేపీ పాలించిందని, ఇన్నాళ్లు అభివృద్ధి ఎందుకు చేయలేక పోయారని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈసారి సంకీర్ణ ప్రభుత్వమేనని, ఢిల్లీలో ప్రతి ఎంపీ కీలకం కాబోతున్నాడని చెప్పారు. తాను హైదరాబాద్‌ నుంచి వస్తూ ఫ్లెక్సీలు చూశానని.. కాంగ్రెస్‌ పెద్దపెద్ద యాడ్స్‌ ఇచ్చింది.. ఇకపై న్యాయం జరుగుతుందని ఆ యాడ్స్‌లో ఉంది. అంటే.. ఇప్పటి వరకు అన్యాయం జరిగిందని వాళ్లే ఒప్పుకుంటున్నట్టేగా అని వ్యాఖ్యానించారు. ఈసారి మోదీ పీఎం పదవి ఊడటం ఖాయమని, కేసీఆర్‌ నాయకత్వంలోనే చక్రం తిప్పబోతున్నామని జోస్యం చెప్పారు.

కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని మోదీ కాపీ కొట్టారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే నిధులు రాబట్టడంతో పాటు ప్రాజెక్టులకు జాతీయ హోదాను సాధిస్తామని, ప్రజలు ఎలాంటి గాబరాకు గురికాకుండా ఆలోచించి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ బహిరంగ సభలో అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌ రెడ్డి, భాస్కర్‌రావు, నల్లగొండ లోక్‌సభ ఎన్నికల పార్టీ ఇన్‌చార్జి రవీందర్‌రావు, సీనియర్‌ నేత బండా నరేందర్‌ రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

హామీలు విస్మరించిన మోదీ
నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో చాయ్‌ వాలా అని, పేదల కష్టాలు తెలుసని చెప్పి ప్రస్తుతం వాటిని అన్నింటినీ విస్మరించాడని కేటీఆర్‌ పేర్కొన్నారు. అధిక మెజార్టీతో గెలిపిస్తే శూన్య హస్తాలు, శుష్క వాగ్దానాలు తప్ప మరొకటి చేయలేక పోయారని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటూ యువతను మభ్య పెట్టారని విమర్శించారు. ‘మోదీ గ్రాఫ్‌ తగ్గింది. ఈసారి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు 80 సీట్లు దాటవు. జిల్లా ప్రజలు ఆలోచించి దెబ్బ కొట్టాలి. 16 ఎంపీలు గెలిస్తే మనమే చక్రం తిప్పుతాం. సారు.. కారు.. పదహారు... ఢిల్లీలో మనవారు అనేదే మన నినాదంగా ముందుకు పోవాలి..’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top