ధర్మపురి ఘటనతో అది నిర్ధారణ అయ్యింది!

KTR Angry On AP Police Survey In Telangana - Sakshi

ధర్మపురి ఘటనతో ఇది నిర్ధారణ అయ్యింది: మంత్రి కేటీఆర్‌

రూ.500 కోట్ల పంపిణీ నిజమే అనిపిస్తోంది 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది అరాజకీయం.. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి 

టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులు చేస్తే మా బాధ్యత ఉండదని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తెలంగాణ ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని, ఇది ధర్మపురిలో అక్కడి పోలీసులు పట్టుబడిన ఘటనతో నిర్ధారణ అయ్యిందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాష్ట్రంలోని అధికార యంత్రాంగాన్ని తెలంగాణలో మోహరిస్తూ అరాజకీయానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

చర్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే... టీఆర్‌ఎస్‌ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అన్నారు. అక్రమాలను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులకు పాల్పడితే తాము బాధ్యత వహించమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌తో సహా ప్రతీ రాజకీయ పార్టీ నేత వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్‌తో కలసి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు.  

ముగ్గురిని గుర్తించిన ఇక్కడి పోలీసులు
‘హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కార్యాలయం వేదికగా తెలంగాణలో అరాజకీయానికి చంద్రబాబు తెరలేపారు. అక్కడి పోలీసు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను తెలంగాణ ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. సర్వేల పేరుతో రాష్ట్రంలో తిరుగుతున్నారని గతంలో మేం ఆరోపణలు చేశాం. అయితే ఏపీ పోలీసు వ్యవస్థతోనే మహాకూటమి తరుఫున డబ్బులు పంపిణీ చేస్తున్నారని నిర్ధారణ అయ్యింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొందరు అనుమానాస్పదంగా ఉండటంతో అక్కడి స్థానికులు ప్రశ్నించారు.

డబ్బులతో దొరికిన వారిని ఏపీ పోలీసు విభాగంలోని నారాయణరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, మధుబాబుగా ఇక్కడి పోలీసు శాఖ గుర్తించింది. సమాచార సేకరణ అయితే ఏమోగానీ ఇలా డబ్బులు పంపిణీ చేయడం ఏమిటి?. వీరిని పట్టుకున్న అర గంటలోనే ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏసీపీ బోస్‌ ఫోన్‌ చేసి విడిపించే ప్రయత్నం చేశారు. ధర్మపురిలో ఉన్న వారు సీఐ స్థాయి వారు కావడంతో పైఅధికారిగా బోస్‌ గట్టిగా ఆదేశించారు. ఇటీవల టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ సన్నిహితుడైన తెలుగు యువత నాయకుడు అనిల్‌ వాహనంలో కూడా రూ.50 లక్షలు దొరికాయి. ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడనేది స్పష్టమవుతోంది. 

ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి... 
పోలీసు శాఖ పూర్తిగా పరిధి ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతాల్లో ఉంటే ఏమోగానీ... తెలంగాణలోని ధర్మపురిలో డబ్బులతో దొరకడం ఏమిటి? దీనికి బాధ్యులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ప్రతీ నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయాలి. చంద్రబాబు ఇక్కడి పత్రికల్లో, టీవీల్లో ప్రచారం చేస్తూ ఏపీ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో చంద్రబాబు ఎలా ప్రచారం చేస్తారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా రాహుల్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గతంలోనే చెప్పారు.

పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇన్నోవాలో రూ.3 కోట్లు చేరవేస్తూ దొరికిపోయారు. ఆయన రిపీటెడ్‌ అఫెండర్‌ అయ్యుండొచ్చు. ఎవరినీ వదలొద్దు. ఎల్‌.రమణ మంత్రుల క్వార్టర్స్‌లో తిష్ట వేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ డీసీపీ బోస్‌ రేవంత్‌రెడ్డితో రెగ్యులర్‌గా కాంటాక్టులో ఉన్నాడు. రమణ, రేవంత్‌.. ఏపీ సీఎం చంద్రబాబుకు అనుసంధానకర్తలుగా పని చేస్తున్నారు. ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశాం. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. అరాజకీయాన్ని టీఆర్‌ఎస్‌ సహించదు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే... మా కార్యకర్తలు దాడులకు దిగితే, ఏదైనా జరిగితే బాధ్యత మాది కాదు. ఆవేశంతో అవాంఛనీయ సంఘటనలు జరిగితే మేం ఏం చేయలేం. 

రూ.500 కోట్ల ఖర్చు నిజమే..! 
డబ్బుల పంపిణీని ఎన్నికల సంఘం నియంత్రించాలి. వాహనాలను ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఉత్తమ్, రేవంత్‌ గతంలో నోట్ల కట్టలతో దొరికిన దొంగలు. అందుకే వాహనాలను ఆపితే ఉలిక్కిపడుతున్నారు. జరుగుతున్న ఘటనలు చూస్తుంటే చంద్రబాబు ఇక్కడ రూ.500 కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నాడనేది నిజమే అని అనిపిస్తోంది. ఏపీ పోలీసు శాఖ ఇంటెలిజెన్స్‌ విభాగం తెలంగాణలో డబ్బుల పంపిణీలో ఉండి, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సోము చనిపోవడానికి కారణమయ్యారు. ఎన్నికల కోసం పోలీసు వ్యవస్థను పావుగా వాడుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.

కాంగ్రెస్‌ ఇంచార్జీ కుంతియా బ్రోకర్‌ అని ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వారి పార్టీలో పదవులు అమ్ముకుంటారని ఆయనే చెప్పారు. దొంగలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఫోన్‌ టాప్‌ చేయాల్సిన కర్మ లేదు’అని అన్నారు. సెన్షేషన్‌ రైజ్‌ ఈవెంట్‌పై కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆరోపణలను ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా... మనుషులు మాట్లాడితేనే స్పందిస్తామని కేటీఆర్‌ అన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు ముగ్గురు ధర్మపురిలో పట్టుబడిన ఘటనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఈ సందర్భంగా మంత్రి చూపించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top