టీఆర్‌ఎస్‌ తప్పు చేసింది.. ఆ నూటైదుమంది కన్నాహీనమా నేను!

Konda Surekha couple Fires on CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమకు టికెట్‌ నిరాకరించడం ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ తప్పు చేసిందని కొండా సురేఖ పేర్కొన్నారు. ‘మమ్మల్ని బయటకు పంపించి టీఆర్‌ఎస్ తప్పు చేసింది. కేసీఆర్‌, కేటీఆర్‌లకు అహంభావం ఎక్కువ. బహిరంగ లేఖ రాసినా కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం లేదు. కేసీఆర్‌ ప్రకటించిన నూట ఐదు మంది అభ్యర్థుల కన్నా హీనంగా ఉన్నానా నేను’ అని ఆమె ఆగ్రహంగా పేర్కొన్నారు.

కేసీఆర్‌ బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. తాము హరీశ్‌ అన్న వర్గమని, అందుకే తమను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఆయన పార్టీలో ఇమడలేని పరిస్థితి ఉందని, అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారని గుర్తు చేశారు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే ప్రకటిస్తామని, తమకు కాంగ్రెస్‌, బీజేపీ సహా 15 పార్టీల నుంచి ఆహ్వానం అందిందని, త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని కొండా సురేఖ చెప్పారు. తాను పోటీ చేయడం ఖాయమని, తనతోపాటు తన భర్త లేదా కూతురు కూడా ఈసారి బరిలో ఉంటారని వెల్లడించారు.

కొండా మురళి మాట్లాడుతూ.. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారని, ఎర్రబెల్లి దయాకర్‌రావు కుటుంబంతో తమకు 30 ఏళ్ల వైరం ఉందని అన్నారు. దయాకర్‌రావు కంటే ముందే కొండా సురేఖ మంత్రి పదవి నిర్వహించారని గుర్తుచేశారు. సురేఖకు ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ తెచ్చే బాధ్యత తనదని అన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top