మళ్లీ అదే అన్యాయం: సీఎంకు కొణతాల లేఖ

Konathala Ramakrishna Open Letter To Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు రంగాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయంపై ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌ కొణతాల రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. ‘ఆర్టికల్‌ 371(డి) ప్రకారం విద్య ఉద్యోగ అవకాశాల్లో 85 శాతం స్థానికులకే కల్పించాలని స్పష్టం చేస్తుంది. కానీ వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఈ నిబంధన అమలు కావడం లేదు. ఇది రాజ్యంగ ఉల్లంఘనే అవుతుంది. ఇందుకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులపై, ప్రైవేట్‌ సంస్థలపై చర్యలు తీసుకోవాల’ ని లేఖలో పేర్కొన్నారు.

‘అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగనట్లే తీవ్ర అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన వాటా రాకపోవడం వల్ల యువత నిరాశకు గురవుతున్నారు. ఈ ప్రాంత వనరులు స్థానికేతరులు కొల్లగొడుతున్నారు. నీళ్లు, నిధులు, నియమకాల్లో తీవ్ర అన్యాయం జరగడం వల్ల ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో స్థానికులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం స్పందించకుంటే యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుతం న్యాయం చేయాల’ని విజ్ఞప్తి చేశారు.

‘స్థానికులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం కాలపరిమితితో కూడిన స్వతంత్ర ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా అన్యాయం జరగకుండా చూడాలి. ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న స్థానిక, స్థానికేతరుల లెక్కలు బయటికి తీసి శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రై‍వేటు సంస్థలు కూడా స్థానికులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే వాటిపైన కఠిన చర్యలు చేపట్టాల’ని లేఖలో కొణతాల డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top