రైల్లో కొణతాల వినూత్న దీక్ష?

Konathala to hold Deeksha in AP Express - Sakshi

విశాఖకు రైల్వేజోన్‌ సహా కేంద్ర హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు చేర్చాలన్నదే ప్రధాన డిమాండ్‌

ఈ నెల 27న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న మాజీ మంత్రి

పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న అనుచరులు

సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వినూత్న నిరసనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 27న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో 48 గంటల పాటు నిరసన దీక్షను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఆసుపత్రి(విమ్స్‌)ను ఎయిమ్స్‌గా మార్చడం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల అమలుకు అవసరమయ్యే నిధులన్నీ రాబోయే బడ్జెట్‌లో కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో కొణతాల ఈ వినూత్న నిరసనను చేపడుతున్నట్లు తెలిసింది.

డిమాండ్ల సాధన కోసం ఒక రాజకీయ నాయకుడు రైలులో దీక్ష చేపట్టడం ఇదే ప్రథమం. గతంలో జాతి పిత మహాత్మా గాంధీ డిమాండ్ల కోసం రైల్లో దీక్షలు చేపట్టేవారు. రైల్లో దీక్ష చేపడుతున్న తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున కొణతాల అనుచరులు కూడా పయనమవుతున్నట్లు సమాచారం.

ఢిల్లీలో ఏం చేయబోతున్నారు?
ఈ నెల 27వ తేదీన ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో దీక్షను ప్రారంభించి.. 29వ తేదీన ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌(మహాత్మాగాంధీ సమాధి)కు వెళ్లి దీక్షను విరమిస్తారు. ఆ తర్వాత పార్లమెంటు ఉభయ సభల ఫ్లోర్‌ లీడర్లను, ఎంపీలను కలసి సంబంధిత డిమాండ్ల సాధనకు మద్దతు కోరతారు. అలాగే కేంద్రమంత్రులను కలుసుకుని వచ్చే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులను కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top