కత్తి వదిలేసినోడు యుద్ధం ఎలా చేస్తాడు?

Kodandaram Fires on KCR - Sakshi

కేసీఆర్‌పై కోదండరాం ఫైర్‌ 

మెదక్‌ జోన్‌: అసమర్థుడు కావడం వల్లే అర్ధంతరంగా పాలన ముగించారని, కత్తి వదిలేసినోడికి యుద్ధం ఎలా చేతనవుతుందని, మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు. ఆదివారం మెదక్‌ పట్టణంలోని టీఎన్జీవో భవన్‌లో జనసమితి జిల్లా చైర్మన్‌ చడిమెల యాదగిరి అధ్యక్షతన జరిగిన రచ్చబండ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి, అణచివేత ధోరణితో రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్లు దుర్మార్గమైన పాలనను కొనసాగించారని మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం 1,200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే వారి ఆత్మలు ఘోషించే విధంగా కేసీఆర్‌ తన సొంత ప్రయోజనాల కోసమే పాలన సాగించారని విమర్శిం చారు. ధర్నాలుండని రాష్ట్రంగా తెలంగాణను చేస్తాన ని ధర్నాచౌక్‌ను ఎత్తేసిన నియంత కేసీఆర్‌ అని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైన్‌ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. 

తెలంగాణ తల్లిని విమర్శించిన ఘనుడు.. 
నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాలతో రాష్ట్రం ఏర్పడితే ఆ మూడింటిని ఈ ప్రభుత్వం ప్రజలకు దూరం చేసిందని ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని సైతం కేసీఆర్‌ విమర్శించారని గుర్తుచేశారు. ఎన్డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీని తెరిపించే చేతగానీ ప్రభుత్వం మళ్లీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు.  

గద్దె దిగడమంటే చేతగానితనమే 
హైదరాబాద్‌: ప్రజలు ఐదేళ్లు పాలించమని కేసీఆర్‌కు అధికారమిస్తే నాలుగేళ్లకే గద్దెదిగిపోవటం చేతగానితనానికి నిదర్శనమని కోదండ రాం ఆరోపించారు. తెలంగాణ జన సమితి ముషీరాబాద్‌ ఇన్‌చార్జి నర్సయ్య ఆధ్వర్యంలో రాంనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో నిరంకుశ, అవినీతి పాలనను చూశామ న్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో రూ.వేల కోట్లు పక్కదారి పట్టాయని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలు కేంద్రంగా రాజకీయాలు ఉండాలని, ప్రతి పైసా రాష్ట్ర ఖజానాకు దక్కాలని, ఈ మార్పుకోసమే జన సమితి ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపుని చ్చారు. రాజకీయాల్లో మార్పు కోసం జన సమితికి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో నగర నాయకులు మాదు సత్యంగౌడ్, బలరాం, ముషీరాబాద్‌ కన్వీనర్‌ మెరుగు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top