అధినేత సభకు అంతా రెడీ

Kcr Meeting All Set At Medak District - Sakshi

సాక్షి, మెదక్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటనకు మెతుకుసీమ ముస్తాబైంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఆయన బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు నర్సాపూర్‌లో సాయంత్రం 5.30 గంటలకు జరిగే మెదక్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభకు టీఆర్‌ఎస్‌ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్‌ లోక్‌సభ స్థానంలో గెలుపు ఎప్పుడో ఖాయమైం దని.. రికార్డు మెజార్టీయే లక్ష్యం అంటూ ధీమాతో ఉన్న నాయకులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు సభ విజయవంతం కోసం స్టార్‌ క్యాంపెయినర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఇప్పటికే  టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు పలుమార్లు సమావేశమయ్యారు. రూపొందించుకున్న ప్రణాళికకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 

నియోజకవర్గానికి 50 వాహనాలు
మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు (మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి, పటాన్‌చెరు) ఉన్నాయి. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి సుమారు 4 వేల వాహనాల్లో మొత్తం 2 లక్షల మందిని సభకు తరలించేలా టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 200 బస్సులు, 200 డీసీఎంలు లేదా ఆటోలు, 150 కార్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

పోలీసుల పటిష్ట బందోబస్తు
సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. వేదికకు వెనుకవైపు కొద్ది దూరంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసింది. దీంతోపాటు సభా ప్రాంగణం, సుమారు 20 ఎకరాల విస్తీర్ణం గల మైదానంలో డాగ్, బాంబ్‌ స్క్వాడ్‌తో జల్లెడ పట్టింది. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్సైల పర్యవేక్షణలో 700 మంది పోలీస్‌ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిడ్‌ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

మూడు చోట్ల పార్కింగ్‌..
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. బహిరంగ సభకు వచ్చేందుకు, వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాహనాల పార్కింగ్‌కు మూడు స్థలాలను ఎంపిక చేశారు. సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలతోపాటు నర్సాపూర్, మెదక్‌ సెగ్మెంట్‌లోని కొన్ని మండలాలకు వెల్దుర్తి మార్గంలోని సాయికృష్ణ ఫంక్షన్‌ హాలు వెనుక పార్కింగ్‌ కేటాయించారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి వచ్చే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజల కోసం నర్సాపూర్‌–తూప్రాన్‌ మార్గంలో ఉన్న హెచ్‌పీ గ్యాస్‌ గోదాం వెనుక స్థలాన్ని కేటాయించారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలతోపాటు మెదక్‌ సెగ్మెంట్‌లోని కొన్ని మండలాలకు నర్సాపూర్‌–వెల్దుర్తి మార్గంలో ఉన్న నారాయణపూర్‌ గ్రామానికి ఇరువైపులా స్థలాన్ని కేటాయించారు. పై రెండు నియోజకవర్గాల నుంచి సీఎం సభకు వచ్చేవారు తూప్రాన్‌ మండలం నాగులపల్లి మీదుగా వెల్దుర్తి, కుకునూరు గ్రామాల మీదుగా నారాయణపూర్‌ చేరుకోవాల్సి ఉంటుంది.

హరీశ్‌రావు పరిశీలన 
వేదిక ఏర్పాట్ల పనులను మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం దగ్గరుండి పర్యవేక్షించారు. మెదక్, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీధర్‌ యాదవ్‌ తదితరులు పరశీలించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జనసమీకరణపై హరీశ్‌రావు పలువురు నేతలతో సమవేశమై సూచనలు చేశారు. 

సెంటిమెంట్‌..
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నర్సాపూర్‌లోనే టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ జరిగింది. సీఎం కేసీఆర్‌ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను సంగారెడ్డి మినహా మిగిలిన తొమ్మిది స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఈ సెంటిమెంట్‌ కలిసి వస్తుందనే కేసీఆర్‌ నర్సాపూర్‌లో సభను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ప్రత్యేక ఏర్పాట్లు
సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం అల్లాదుర్గంలో జరిగే జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం హెలీక్యాప్టర్‌లో నర్సాపూర్‌కు రానున్నారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గాన తిరిగి వెళ్లనున్నట్లు తెలిసింది. అల్లాదుర్గంలో సభ ఆలస్యమైన పక్షంలో రోడ్డు మార్గం గుండా సీఎం వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నర్సాపూర్‌–మెదక్‌ మార్గం పట్టణ శివారులోని మూతపడిన ఖండసారి షుగర్‌ ఫ్యాక్టరీ పక్క నుంచి సభాస్థలి వరకు కాన్వాయ్‌ వచ్చేలా ప్రత్యేక రోడ్డు వేయడంతోపాటు లైట్లు ఏర్పాటు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top