కర్ణాటకలో అభివృద్ధిరహిత అవినీతి

Karnataka government wants development-free corruption - Sakshi

కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వంపై మోదీ ధ్వజం

బూత్‌స్థాయి కార్యకర్తలతో ముచ్చటించిన ప్రధాని

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో గర్వం పెరిగిందని, వారి దృష్టంతా అభివృద్ధి రహిత అవినీతిపైనే ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పదవుల కోసం పోటీపడటానికే అధికారంలో కొనసాగుతున్నారని, రుణమాఫీ పేరిట తెచ్చిన పథకం రైతులపై పేల్చిన ఒక హేయమైన జోక్‌ అని ఘాటుగా స్పందించారు. మోదీ శుక్రవారం కర్ణాటక బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ‘కర్ణాటక ప్రజలు అవినీతిరహిత పాలనను కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అభివృద్ధిరహిత అవినీతిని అందిస్తోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు.  కర్ణాటకలో పదవుల పంపకం మ్యూజికల్‌ చైర్స్‌ గేమ్‌ తరహాలో సాగుతోందని విమర్శించారు.

రూ.44 వేల కోట్ల మేర రైతు రుణాల్ని మాఫీ చేస్తామని సీఎం కుమారస్వామి ప్రకటించినా, దాని అమలు నత్తనడకన సాగుతోందని, ఇప్పటి వరకు కేవలం 800 మంది రైతులకే లబ్ధి చేకూరిందని తెలిపారు.  రాబోయే ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేసేవారికి ఎలాంటి ఐడీ కార్డులు అవసరం లేదని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ విధానాల్లో యువత అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మోదీ వెల్లడించారు. ఇందుకోసం ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, ఎంట్రెప్రెన్యూర్‌షిప్, ఎక్సలెన్స్‌ అనే 4 ‘ఈ’లపై ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలిపారు. నాలుగేళ్లలో 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు, ఒక నిట్, 14 ట్రిపుల్‌ ఐటీలు, 103 కేంద్రీయ విద్యాలయాలను స్థాపించినట్లు గుర్తు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top