
కన్నడ సూపర్‌స్టార్ సుదీప్
నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే తారలు ఇటీవల కాలంలో రాజకీయాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే నెలలో కర్ణాటకలో జరిగే శాసనసభ ఎన్నికల ప్రచారంలో సినీతారలు సందడి చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ శాండల్‌వుడ్ స్టార్ కిచ్చ సుదీప్ రాజకీయ అరంగ్రేటం చేస్తారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆయన నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
సాక్షి, బెంగళూరు: కన్నడ సినీనటుడు సుదీప్ అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరుతారా? లేక జేడీఎస్ తీర్థం పుచ్చుకుంటారా అనే అంశంపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు తారలు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటారనే పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలతో సినీ తారలు చర్చలు జరుపుతున్నారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి మూడురోజుల క్రితం సుదీప్‌ను తన ఇంటికి ఆహ్వానించారు.
తాజాగా గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటికి సుదీప్ వెళ్లి చర్యలు జరిపారు. కాగా గతంలో జేడీఎస్ ప్రచారానికి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎంతో సుదీప్ చర్చల అనంతరం అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. సుదీప్ జేడీఎస్‌లో చేరుతారా లేక కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారా? అనే దానిపై గందరగోళం నెలకొంది.
2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుదీప్ రాజకీయ అరంగేట్రం చేస్తారనే వార్తలు చక్కార్లు కొట్టిన విషయం విదితమే. అంతేకాక 2011 ఉప ఎన్నికల్లో దావణగెరె నుంచి బరిలోకి దిగుతారనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి.