
సాక్షి, మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ జ్యోతిరాదిత్య సింధియా మరోసారి సీఎం కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కమల్‌నాథ్ బయటివారి కంటే సొంత మంత్రుల అభిప్రాయాలకే విలువివ్వాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేధాలపై సింధియా స్పందిస్తూ ఇరువర్గాల వాదనకు సీఎం ప్రాధాన్యతనిచ్చి వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. పార్టీలో బయటవారి ప్రమేయానికి కమల్‌నాథ్ ఇకనైనా ముగింపు పలికితే బాగుంటుందన్నారు. పదిహేనేళ్లు కష్టపడి పార్టిని అధికారంలోకి తీసుకొచ్చామన్న సంగతిని సీఎం గుర్తించాలన్నారు. వేగంగా అభివృద్ది చేయాలన్న కాంగ్రెస్ నాయకుల ఆశలను నిజం చేయాలన్నారు.
విభేదాలను పక్కనపెట్టి అందరు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. అదే విధంగా పార్టీ మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ రాజకీయాలలో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేసులో ఇద్దరు ముందున్నవారే. అయితే అనూహ్యంగా కమల్‌నాథ్‌కు సీఎం పదవి వరించిన విషయం విదితమే. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఉమాంగ్ సింగర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఉమాంగ్ ఆరోపణలకు సింధియా మద్దతివ్వడం విశేషం.