ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన టీడీపీ నేతలు

JC Diwakar Reddy Threatens To Voters - Sakshi

సాక్షి, అమరావతి : విజయవకాశలపై విశ్వాసం సన్నగిల్లిన టీడీపీ.. దాడులు, దౌర్జన్యాలు, అరాచక శక్తులతో భయోత్పాతం సృష్టించి, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునే కుట్రకు తెగబడుతోంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ప్రచారం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఓటర్లపై బెదిరింపులకు దిగారు. తన కొడుకుకు ఓట్లు వేయకపోతే మీ అంతు చూస్తానంటూ పబ్లిగ్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి నార్పల మండలంలో ప్రచారం చేశారు. ఆయన వర్గీయులు యధేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బెదిరింపులకు దిగిన జేసీ వర్గీయులతో కురగానిపల్లి, నడిందోడ్డి, కేశవపల్లి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. తమను జేసీ వర్గీయులు బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు మొర పెట్టుకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. నంబలిపులుకుంటలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేత బాలాజీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని దగ్గర నుంచి రూ. 40వేలు, ఓటర్ల స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా డబ్బు పంపిణీ చేయిస్తున్నారు. ఆమడగురు మండలంలోని కులకుంటపల్లిలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న హౌసింగ్‌ ఉద్యోగులు రాజేష్‌, మారుతిలను పోలీసులకు అప్పగించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

మంగళగిరిలో మద్యం, డబ్బు పంపిణీ
మంగళగిరిలో ఓటమి తథ్యమని భావించిన టీడీపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోంది. తాడేపల్లి నులకపేటలో యదేచ్ఛగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఓటుకు రూ. రెండు నుంచి ఐదు వేల వరకు పంచుతోంది. ఐదు ఓట్లకు పైగా ఉన్న కుటుంబానికి ఎల్‌ఈడీ టీవీ, ప్రిజ్‌, మొబైల్‌ ఫోన్స్‌ పంపిణీ చేస్తున్నారు.

మీడియాపై గల్లా అనుచరుల దాడి
గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ అనుచరులు మీడియాపై దాడికి దిగారు. జయదేవ్ ఆఫీసులో భారీ స్థాయిలో డబ్బులు నిల్వ ఉంచారని సమాచారం రావడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై గల్లా అనుచరులు దాడికి దిగారు. మీడియా ప్రతినిధి ఐడి కార్డుతో పాటు బైకు తాళాలు కూడా లాక్కున్నారు. దీంతో జర్నలిస్టు సాంబశివరావు గల్లా జయదేవ్ అనుచరులపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో  పిర్యాదు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top