అవకాశం ఇస్తే తెలంగాణలో పోటీ చేస్తా : లగడపాటి

I Will Contest Form Telangana If Given Chance Says Lagadapati - Sakshi

పోటీ చేయాల్సిందిగా మెదక్‌ జిల్లా ప్రజలు కోరుతున్నారు

అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేస్తా

వైఎస్‌ జగన్‌పై దాడిని ఖండిస్తున్న : లగడపాటి రాజగోపాల్‌

సాక్షి​, న్యూఢిల్లీ :  తనకు అవకాశం ఇస్తే తెలంగాణలో పోటీచేయడానికి సిద్దంగా ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో భావోద్వేగాలతో కూడిన రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని.. మెదక్‌ జిల్లా ప్రజలు తనను తెలంగాణలో పోటీ చేయాలని కోరుతున్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంపీగా పోటీచేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తాను కేవలం ఆంధ్రా రాజకీయల నుంచి మాత్రమే తప్పుకున్నానని.. తెలంగాణలో ప్రజలు కోరుకుంటే తప్పకుండా పోటీ చెస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న లగడపాటి.. తెలంగాణలో పోటీ చేస్తానని పేర్కొనడం గమనార్హం.

ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రతిసారి సర్వే ఫలితాలతో లగడపాటి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా తెలంగాణ ఎన్నికలు పూర్తి అవ్వగానే సర్వే ఫలితాలను ప్రకటిస్తానని అన్నారు. తన పేరుతో సోషల్‌ మీడియాలో, వాట్సప్‌, యూట్యూబ్‌లో వచ్చే సర్వేలు తనవికావని, వాటిని నమ్మవద్దని చెప్పారు. 2014 నుంచి రాజకీయలకు దూరంగా ఉన్నానని.. ప్రజల భావోద్వేగాలతో ఎదగడానికి ప్రయత్నిస్తున్నానని అందరూ అనుకోబట్టే రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో లగడపాటి కాంగ్రెస్‌ తరుఫున విజయవాడ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ.. లోక్‌సభలో  సభ్యులతో పెప్పర్‌స్ర్పే దాడితో సంచలనం సృష్టించారు. ఆ తరువాత ఎంపీ పదవికి రాజీనామా చేసిన లగడపాటి.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నట్లు రాజగోపాల్‌ తెలిపారు. రాజకీయాల్లో అనేక దారులున్నప్పుడు బౌతికపరమైన దాడులు సరైన విధానం కాదని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top