
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి 1967 ఎన్నికల్లో పోటీ చేసిన జి.వెంకటస్వామి.. 1971, 1977లోనూ గెలిచి వరుసగా మూడుమార్లు గెలిచారు. ఆయన తరువాత నంది ఎల్లయ్య 1989, 1991, 1996 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దయి.. మెదక్ లోక్‌సభ స్థానంలో అంతర్భాగమైంది. ఇక, సిద్దిపేట అసెంబ్లీ స్థానంలోనూ హ్యాట్రిక్‌ల మోత మోగుతోంది. అనంతుల మదన్‌మోహన్ 1972, 1978, 1983 శాసనసభ ఎన్నికల్లో తొలి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన తరువాత టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే పార్టీకి చెందిన ముఖ్యనేత టి.హరీశ్‌రావు కూడా 2004, 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి డబుల్ హ్యాట్రిక్ సాధించారు.