‘బాబు’ అనుచరుడే హర్షవర్ధన్‌

Harshavardhan is closest to Chandrababu and Lokesh - Sakshi

     సీఎం పరిచయంతోనే రెస్టారెంట్‌ ఏర్పాటు

     ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రికి ఏర్పాట్లు చూసేది ఈయనే

     ఫ్యూజన్‌ ఫుడ్స్‌ ప్రారంభించింది చినబాబే

     సీఎం, లోకేష్‌తో సాన్నిహిత్యం! 

సాక్షి, విశాఖపట్నం: టి. హర్షవర్ధన్‌ప్రసాద్‌.. ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావు పనిచేస్తున్న ఎయిర్‌పోర్టులోని ప్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని. టీడీపీ సీనియర్‌ నాయకుడు. విశాఖ జిల్లా గాజువాక నుంచి టీడీపీ తరఫున పోటీచేసేందుకు రెండుసార్లు విఫలయత్నం చేశారు. గతంలో చంద్రబాబు ఎప్పుడు సిటీకి వచ్చినా ఆయన వాహనానికి డ్రైవర్‌గా పనిచేసేవాడని చెబుతుంటారు. టీడీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు చంద్రబాబుతో నేరుగా మాట్లాడగలిగే నాయకుల్లో హర్షవర్ధన్‌ ఒకరు. నగరంలోని గురజాడ కళాక్షేత్రం పక్కనే వుడాకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

ఈ లీజు వ్యవహారం కూడా తీవ్ర వివాదస్పదమైంది. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే నిబంధనలకు విరుద్ధంగా లీజు పద్ధతిలో ఈ స్థలాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న పరిచయంతోనే ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్‌ సంపాదించగలిగారు. టీడీపీ మాజీ నేత సుందరపు విజయకుమార్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ను నడుపుతున్నట్లు సమాచారం. ఈ రెస్టారెంట్‌ను ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ ప్రారంభించారు. చంద్రబాబు ఎప్పుడు నగరానికి వచ్చినా ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లుచేసేది హర్షవర్ధనే అని అందరూ చెబుతుంటారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌కు చెందిన రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు జననేతపై హత్యా యత్నానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. 

వుడాకు నామమాత్రపు ధర చెల్లిస్తూ ఏళ్ల తరబడి లీజు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌లో పని చేస్తున్నాడు. ఈ ఘటనను రాజకీయం చేస్తూ.. ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమానితో తమకు సంబంధం లేదంటూ అధికార టీడీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సదరు ఆహారశాల యజమాని అధికార పార్టీకి చెందిన నాయకుడిదేనని స్పష్టం చేస్తూ ‘సాక్షి’ గతంలోనే కథనాలు ప్రచురించింది. విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) ఉద్యోగ భవన్‌ ఎదురుగా గురజాడ కళాక్షేత్రాన్ని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని 2003 మార్చి 5న ఫ్యూజన్‌ ఫుడ్స్‌(సెవెన్‌ డేస్‌) అధినేత హర్షవర్థన్‌ ప్రసాద్‌కు లీజ్‌కు ఇచ్చారు.

అప్పట్లో ఈ స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు మూడు సంస్థలు పోటీ పడినప్పటికీ తక్కువ ధర కోట్‌ చేసిన హర్షవర్థన్‌కే దక్కింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలతో హర్షవర్థన్‌కు సత్సంబంధాలుండడంతో 10,842 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు రూ.13,500 నామమాత్రపు అద్దె చెల్లించాలన్న ఒప్పందంతో 9 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు. అయితే, లీజు సొమ్ము చెల్లింపులో హర్షవర్థన్‌ జాప్యం చేయడంతో.. స్థలాన్ని ఖాళీ చెయ్యాలంటూ ‘వుడా’ ఆదేశించింది. దీనిపై జిల్లా కోర్టులో ఫ్యుజన్‌ ఫుడ్స్‌ పిటిషన్‌ దాఖలు చెయ్యగా.. దాన్ని కోర్టు కొట్టేసింది. వెంటనే ఖాళీ చెయ్యాలని వుడా మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే, ఫ్యూజన్‌ ఫుడ్స్‌ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరించింది. ఫ్యూజన్‌ ఫుడ్స్‌కే అడిగినన్ని సంవత్సరాలపాటు లీజు పెంచాలంటూ వుడాపై ఒత్తిడి తీసుకొచ్చింది. తొమ్మిదేళ్లు అంటే 2024 వరకూ లీజు పెంచాలంటూ వుడాను ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు ఒప్పుకోక తప్పలేదు. లీజు గడువుని 33 ఏళ్లకు పెంచాల్సిందేనని హర్షవర్థన్‌ పట్టుబట్టగా, టీడీపీ నేతలు అందుకు వంతపాడారు. ఫ్యూజన్‌ ఫుడ్స్‌కే స్థలం దక్కేలా చేశారు. ఆ రోజున అంతలా హర్షవర్థన్‌కు అండదండలు అందించిన టీడీపీ ఇప్పుడు అతడితో తమకు సంబంధం లేదని చెప్పడం విస్మయపరుస్తోంది. 

హర్షవర్ధన్‌కు సీఎం, లోకేష్‌తో సాన్నిహిత్యం! 
ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు పనిచేసే విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ప్యూజన్‌ ఫుడ్స్‌ అధినేత హర్షవర్ధన్‌ ప్రసాద్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని విశాఖకు చెందిన టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి టికెట్‌ ఇస్తామని  హర్షవర్ధన్‌కు చంద్రబాబు హామీ ఇచ్చి విభిన్న కారణాలవల్ల నిలబెట్టుకోలేకపోయారు.అలాగే రాష్ట్ర ఒలంపిక్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ను చేస్తామని, స్పోర్ట్స్‌ అథారిటీ (శాప్‌) చైర్మన్‌ పదవి ఇస్తామని హర్షవర్ధన్‌కు చంద్రబాబు, లోకేష్‌ గట్టి హామీ ఇచ్చినప్పటికీ.. టీడీపీ నేతలు సహకరించక పోవడంతో ఆ పదవులు ఆయనకు దక్కలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top