బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు 

Harish Rao Comments On BJP - Sakshi

జీఎస్టీ, నోట్ల రద్దుతో ఒరిగిందేమీ లేదు 

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు  

నర్సాపూర్‌: కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేమీ లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 3న మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను శుక్రవారం హరీశ్‌ పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు, కూలీలు, బీసీలు, పేద ప్రజలకు మోదీ సర్కార్‌ ఏం మేలు చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రామజన్మభూమి, ఆర్టికల్‌ 370 వంటి అంశాలను ఎన్నికల అస్త్రాలుగా వాడుకుంటుందే తప్ప వాటిని పరిష్కరించలేదని విమర్శించారు. నోట్ల రద్దుతో పేదలు అనేక కష్టాలపాలయ్యారని అన్నారు.

జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందని మోదీ ప్రకటించారని, అయితే ఏ రాష్ట్రం ఆదాయం పెరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ, ఏపీ సీఎంలను చర్చలకు పిలిచి విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చొరవ తీసుకోలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ పదుల సార్లు ఢిల్లీకి వెళ్లి వినతులు ఇచ్చినా ఒక్కపైసా ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవదని, డిపాజిట్ల కోసమే ఆ పార్టీ అభ్యర్థులు, నాయకులు ఆరాటపడాలని ఆయన ఎద్దేవా చేశారు.  

తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని హరీశ్‌ పేర్కొన్నారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమఅభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి 5 లక్షల మెజారిటీ వస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మెదక్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, మాజీ మంత్రి ముత్యం రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్, టీఆర్‌ఎస్‌ నాయకుడు దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.  

ప్రచారంలో అపశృతి 
తూప్రాన్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షోలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సందర్భంలో ప్రచార రథానికి బిగించిన విద్యుత్‌ లైట్లు ఆరిపోయి, వాహనానికి వెనుక బిగించిన జనరేటర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించి వాహనంపై ఉన్న హరీశ్‌రావుతోపాటు మిగతా నేతలు కిందికి దిగేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top