‘నా రాజకీయ జీవితం ముగియబోతోంది’

Giriraj Singh Says May His Political Innings End By 2024 - Sakshi

పట్నా : తాను పదవుల కోసం రాజకీయాల్లో ప్రవేశించలేదని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలనే కలతోనే ఈ రంగంలో అడుగుపెట్టానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో తన కల పరిపూర్ణమైందని ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. మంగళవారం గిరిరాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ..‘నరేంద్ర మోదీ లాంటి ప్రధాని ఉండటం నిజంగా మన అదృష్టం. కశ్మీర్‌ విషయంలో ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చారు.  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పదవీ కాలం పూర్తి చేసుకునే లోపు అంటే 2024 నాటికి నా రాజకీయ జీవితం ముగిసే అవకాశం ఉంది. అయినా ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో పదవులు చేపట్టేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు. కశ్మీర్‌ పూర్తిగా భారత్‌లో విలీనమవడం నా కల. మా పార్టీ సిద్ధాంతకర్త శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ దేనికోసమే ప్రాణ త్యాగం చేశారో.. ఆర్టికల్‌ 370 రద్దుతో దానికి ప్రతిఫలం దక్కింది అని పేర్కొన్నారు. (చదవండి : ఆర్టికల్‌ 370 రద్దు; ఆయన కల నెరవేరింది!)

ఇక 2020లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బరిలో దిగే అవకాశం ఉందా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా..2024 నాటికి తాను రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నానని గిరిరాజ్‌ సమాధానమిచ్చారు. కాగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గిరిరాజ్‌ లోక్‌సభ ఎన్నికల్లో బెగుసరాయ్‌ నుంచి పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాదాపు 4 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో మోదీ 2.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక గతంలో బీజేపీ నేతలు ఇఫ్తార్‌ విందులకు హాజరైన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన గిరిరాజ్‌..‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అంటూ ట్వీట్‌ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా...మోదీని వ్యతిరేకించేవారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top