విపక్షం ఈర్ష్యతో బురద జల్లుతోంది

Gadikota Srikanth Reddy Comments On TDP - Sakshi

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

జగన్‌ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు టీడీపీకి కనపడ్డం లేదా?

108తో ప్రజలకు మేలు జరుగుతోంటే నీచ రాజకీయాలా? 

సాక్షి, అమరావతి:  కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రజల మేలు కోరి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలుతో ముందుకెళుతుంటే ప్రతిపక్ష టీడీపీ ఈర్ష్యతో బురద జల్లుతోందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వారికి మంచి పనులు చేయడం చేతకాలేదు.. సీఎం వైఎస్‌ జగన్‌ మంచి పనులు చేస్తోంటే స్వాగతించడానికీ వారికి మనసొప్పదని దుయ్యబట్టారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనాకైనా మందు వస్తుందేమోగానీ చంద్రబాబు ఈర్ష్యకు, కడుపు మంటకు మందు మాత్రం కనిపెట్టలేమని సీఎం అన్నమాట అక్షర సత్యమన్నారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో ఒకేసారి పెద్ద ఎత్తున అన్ని వసతులతో కూడిన 108, 104 వాహనాలను సీఎం ప్రారంభించడం మహత్తర ఘట్టమని, జాతీయ మీడియా సైతం మెచ్చుకుంటుంటే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కనీసం అభినందించలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. గడికోట ఇంకా ఏమన్నారంటే..  

► గత 13 నెలలుగా ఒక పద్ధతి ప్రకారం ముందుగానే ప్రకటించి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోవడం సీఎం వైఎస్‌ జగన్‌ ఘనత. మార్చి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండిపడినా.. గత సర్కారు చేసిన అప్పులు, బకాయిలు ఒకవైపు తీరుస్తూనే గడిచిన ఆరు నెలల్లో రూ.28,122 కోట్ల మేరకు 3,53,02,377 మంది ప్రజలకు అందజేశారు. ఇది గొప్ప విషయం కాదా? ఏరోజైనా టీడీపీ పాలనలో ఇలా చేయగలిగారా?  
► సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షం మీడియాతో అడ్డగోలుగా మాట్లాడకుండా అధికారపక్షం ఏం చేస్తోందో గ్రహించాలి.   

రామోజీ... ఈ ద్వంద్వ ప్రమాణాలేంటి? 
► ‘ఈనాడు’ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఏమిటి? తెలుగు రాష్ట్రాల్లో కరోనాపై వేర్వేరు కథనాలు రాయడం సమంజసం కాదు. రామోజీరావు ఈనాడును చూడకుండా ఉన్నారో, వేరేవాళ్లకు అప్పగించి ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకున్నారో తెలియదు. 9 లక్షలకు పైగా టెస్టులు చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ. ఆంధ్ర చేస్తున్న చర్యలపైన సానుకూలత రాకుండా ప్రజల్లో విషం నింపాలని, వారి మైండ్‌ డైవర్ట్‌ చేయాలనే భావన ఉండటం శ్రేయస్కరం కాదు. 
► మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకు అంబులెన్స్‌లలో అవినీతి జరిగిందని ఇష్టానుసారం మాట్లాడతారా? ఈ టెండర్‌ ఎలా జరిగిందో 4 పేజీల నోట్‌ ఉంది. అందులో అవినీతి జరిగిందంటే చర్చకు రమ్మని ఛాలెంజ్‌ చేస్తున్నాను.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top