కేసీఆర్‌కు ఈసీ నోటీసు

Election Commission notices to kcr - Sakshi

అధికారిక నివాసంలో టీఆర్‌ఎస్‌ సమావేశాలపై అభ్యంతరం

24 గంటల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం

ప్రతిపక్షాల ఫోన్ల ట్యాపింగ్‌ ఆరోపణలపై డీజీపీ,

ఇంటెలిజెన్స్‌ ఐజీకీ నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌తోపాటు రాష్ట్ర మంత్రుల అధికారిక నివాసాల్లో అధికార టీఆర్‌ఎస్‌ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తోందంటూ అందిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై 24 గంటల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ శుక్రవారం నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక నివాసాల్లో టీఆర్‌ఎస్‌ సమావేశాలు నిర్వహిస్తోందని, పోలీసులు కక్షపూరితంగా కేవలం ప్రతిపక్ష నాయకుల వాహనాలనే తనిఖీ చేస్తున్నారని, తమ ఫోన్లను రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ట్యాపింగ్‌ చేస్తోందని ఆరోపిస్తూ మహాకూటమి ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్‌ గురువారం సీఈఓ రజత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది.

రాష్ట్ర శాసనసభ రద్దైన అనంతరం ప్రగతి భవన్‌లో 10 వేర్వేరు సందర్భాల్లో టీఆర్‌ఎస్‌ సమావేశాలను నిర్వహించారని ఫిర్యాదులో మహాకూటమి పేర్కొంది. ఆయా సమావేశాలకు సంబంధించిన తేదీలు, సమయంతోపాటు ఆధారాలుగా ఫొటోలు, వీడియోలు, వార్తాపత్రికల క్లిప్పింగులను సమర్పించింది. ఈ ఫిర్యాదుల ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం పంపించింది. నోటిసులకు కేసీఆర్‌ ఇచ్చే వివరణ ఆధారంగా ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఈసీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వివరణ సంతృప్తికరంగా లేనిపక్షంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించిన కేసును నమోదు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.

మరోవైపు రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లను ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ విభాగంతో అక్రమంగా ట్యాపింగ్‌ చేయిస్తోందని మహాకూటమి చేసిన ఫిర్యాదుపై వివరణ కోరుతూ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ ఐజీలకు ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఏ కారణంతో చేస్తున్నారో 24 గంటల్లోగా తెలియజేయాలని ఆదేశించింది.

వివక్షపూరితంగా కేవలం ప్రతిపక్ష నేతల వాహనాలనే పోలీసులు తనిఖీ చేస్తున్నారని మహాకూటమి చేసిన మరో ఫిర్యాదుపైనా వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఎంఎంటీఎస్‌ రైళ్లపై సీఎం కేసీఆర్‌ బొమ్మతో ఏర్పాటు చేసిన ప్రకటనలను తొలగించకపోవడంపై వివరణ ఇవ్వాలని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు సైతం ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. సంబంధిత అధికారుల నుంచి వివరణలు అందాక ఈసీ వాటిని పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top