ప్రధానికి ఈసీ దాసోహం

Election Commission has surrendered to Narendra Modi - Sakshi

రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం(ఈసీ) లొంగిపోయిందని, ఈసీ అంటే ఇకపై ఎవరికీ భయం, గౌరవం ఉండవని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ‘ఎలక్టోరల్‌ బాండ్లు మొదలు కొని ఈవీఎంలు, ఎన్నికల షెడ్యూల్‌లో మోసం, నమో టీవీ ప్రారంభం, మోదీ సైన్యం అంటూ వ్యాఖ్యలు.. తాజాగా కేదార్‌నాథ్‌లో మోదీ డ్రామా.. వీటన్నిటి విషయంలో ఈసీ మోదీకి, ఆయన ముఠాకు సాగిలపడిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈసీ అంటే ఇకపై ఎవరికీ గౌరవం కానీ, భయం కానీ ఉండవు’ అని ఆదివారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తన అసమ్మతిని రికార్డు చేయనందుకు నిరసనగా ఈసీ సమావేశాలకు హాజరుకానంటూ కమిషనర్‌ అశోక్‌ లావాసా అసంతృప్తి వెళ్లగక్కిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసీ తన స్వాతంత్య్రాన్ని ప్రభుత్వానికి ధారాదత్తం చేయడం సిగ్గుచేటంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ట్విట్టర్‌లో ఆరోపించారు. తీర్థయాత్రలు చేయడం ద్వారా మతాన్ని, మత చిహ్నాలను వాడుకుని ప్రధాని మోదీ ఓటింగ్‌ను ప్రభావితం చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కిందికి వస్తుందని చిదంబరం పేర్కొన్నారు.

తల్లులు, అక్కాచెల్లెళ్లకు సెల్యూట్‌
సాధారణ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి నందుకు మహిళలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ప్రశంసించారు. తల్లులు, సోదరిల గొంతును కచ్చితంగా వినాలని పేర్కొన్నారు. చివరిదశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన అనంతరం రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చివరిదైన 7వ దశలో లోక్‌సభకు ఆదివారం ఎన్నికలు ముగిశాయి. కృతనిశ్చయంతో ఉన్న ఓటర్లు, పోటీ చేసిన అభ్యర్థులే కాకుండా, మన తల్లులు, అక్కాచెల్లెళ్లు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. వారందరికీ నేను గౌరవ వందనం చేస్తున్నాను’ అని రాహుల్‌ అన్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ ప్రధాన ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేస్తూ చివరిదశ ఎన్నికల్లోనూ ప్రజలు ఓటు వేసి, దేశంలో అందరి అభిప్రాయాలు వినిపడేలా చూడాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top