పాలమూరు గళం వినిపిస్తా!

DK Aruna Special Interview on Lok Sabha Elections - Sakshi

‘గత పాలకుల నిర్లక్ష్యంతో పాలమూరు అభివృద్ధిలో వెనుకబడిపోయింది. నిధులు లేక కొన్ని పనులు, నిధులు మంజూరైనా క్షేత్రస్థాయిలో పనులు జరగక పాలమూరు అన్యాయానికి గురైంది. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టుల మంజూ రుతో పాలమూరు పురోగమించాలంటే ఇక్కడ బీజేపీ గెలవాల్సిందే’నంటున్న డీకే అరుణ మనసులోని మాట..

ప్రాజెక్టుల కదలిక
మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. పరిగి–వికారాబాద్, గద్వాల– మాచర్ల రైల్వే లైను, దేవరకద్ర వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, పాలమూరు రైల్వే స్టేషన్‌ అప్‌గ్రెడేషన్, జిల్లా కేంద్రంలో టి.డి గుట్ట, జడ్చర్ల వద్ద ఆర్‌వో బ్రిడ్జి వంటి ప్రాజెక్టులు పడకేశాయి.  గద్వాల–కొత్తకోట–కర్ణాటక జాతీయ రహదారి ప్రతిపాదనను తొక్కి పెట్టేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐదేళ్లు పాలించినా.. పెం డింగ్‌ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించిందేమీ లేదు. నేను ఎంపీగా గెలిస్తే.. పెండింగ్‌ ప్రాజెక్టుల్లో చలనం తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టులను మంజూరు చేయిస్తాను.

డీకే అరుణ
స్వగ్రామం : ధన్వాడ(పుట్టినిల్లు), గద్వాల (మెట్టినిల్లు)
భర్త పేరు : డీకే భరతసింహారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
సంతానం : ముగ్గురు కూతుళ్లు
తల్లిదండ్రులు : సుమిత్రమ్మ, చిట్టెం నర్సిరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
విద్యార్హత : ఇంటర్మీడియేట్‌
రాజకీయ అనుభవం : వరుసగా మూడు సార్లు గద్వాల ఎమ్మెల్యే,ఐదేళ్లు మంత్రి.

నియోజకవర్గం కొట్టిన పిండి!
నాకు పాలనలో పట్టుంది. నేను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని సమస్యలపై మాత్రమే కాదు ఉమ్మడి జిల్లా అంతటా అవగాహన ఉంది. వాటి పరిష్కారానికి ఏం చేయాలనే కార్యాచరణ ప్రణాళిక కూడా ఉంది. నా పుట్టినిల్లు నారాయణపేట జిల్లా పరిధిలోనిది కావడం, మా తండ్రి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా సేవలు అందించడంతో అన్నిచోట్లా నాకు బలగముంది.  

సస్యశ్యామలం!
రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కిందట గద్వాలలో హ్యాండ్లూమ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేసింది. ఇంత వరకు నయాపైసా విడుదల చేయలేదు. పాలమూరు జిల్లాకు కృష్ణానది జలాలు అందడం లేదు. జూరాల ప్రాజెక్టులో నీరు లేదు. న దుల అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణానదికి తరలించి, ప్రతి ఎకరాకు సాగునీరందించి సస్యశ్యామలం చేస్తా. మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధిలో మరో నవోదయ విద్యాలయం, జిల్లాకో కేంద్రీయ, నవోదయ విద్యాలయం తెస్తా.

మహిళలే పారిశ్రామికవేత్తలు!
మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా మహిళా    సాధికారతపై దృష్టి సారిస్తాను. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహించి.. ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తా.

బ్రాండ్‌ అంబాసిడర్‌ మోదీ!
ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలే నా ప్రధాన ప్రచారాస్త్రాలు. మోదీ పాలనలో దేశ రక్షణ, ప్రజల భద్రత, సుస్థిర పాలనను చూశాం. వీటిని కొనసాగించుకోవడానికి ప్రజలుæ తిరిగి బీజేపీకే అధికారాన్నిస్తారు.
– ముహమద్‌ ముజాహిద్‌ బాబా,సాక్షి– మహబూబ్‌నగర్‌ ప్రతినిధి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top