‘ఇది సీఎం కేసీఆర్‌ చేతకానితనానికి నిదర్శన’

CPI State Secretary Slams CM KCR Over RTC Strikes In Adilabad - Sakshi

సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్‌) :  ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సీపీఐ జిల్లా నిర్మాణ మహాసభలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానికంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్టీసీ సంస్థ నష్టాలకు ఉద్యోగులు, కార్మికులను కారణంగా ఎత్తి చూపడం సీఎం కేసీఆర్‌ చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే మన సీఎం మాత్రం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. లేకుంటే అన్ని సంఘాలు, పార్టీలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, కుల సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయి.

అనంతరం జేఏసీ నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. స్థానిక సుందరయ్య భవనం నుంచి అటవీశాఖ విశ్రాంతి భవనానికి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే జోగురామన్నకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ టీఎంయూ ప్రాంతీయ అధ్యక్షుడు బీడీ చారి, రీజినల్‌ సెక్రటరీ ఆర్‌.రెడ్డి, డిపో అధ్యక్షుడు ఎం.నారాయణ, డిపో సెక్రటరీ జీవీఆర్‌ కిషన్, డిపో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీఎస్‌ రాజు, ఈయూ డిపో సెక్రటరీ జేబీ రావు, కమిటీ మెంబర్‌ హై మద్, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజినల్‌ సెక్రటరీ ఎస్‌బీరావు, డిపో అధ్యక్షుడు డి.రమేశ్, డిపో సెక్రటరీ ఆశన్న, సీపీఐ నాయకులు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలే బుద్ధి చెప్పాలి
కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన సీపీఐ జిల్లా నిర్మాణ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా నేటికి ప్రాథమిక హక్కులు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఎన్నో కష్టాలకోర్చి ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపిస్తే లాభాపేక్ష పేరిట వాటిని మూసివేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో వ్యవసాయానికి దూరమవుతున్నారన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలకు, అసంఘటిత కార్మికులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకురాలు నళినీరెడ్డి, అరుణ్‌కుమార్, గడ్డం భూపతిరెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్, గోవర్ధన్, కె.రాములు, సిర్ర దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top