కార్పొరేటర్‌ టు కేబినెట్‌.. 

Corporator To Cabinet Leaders Special Story In Telangana - Sakshi

బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుక 

బల్దియా మేయర్‌గా పనిచేసిన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి 

మాజీ మంత్రి పద్మారావుగౌడ్‌ కూడా ఒకప్పుడు కార్పొరేటరే 

ఎంఐఎం ప్రస్తుత ఎమ్మెల్యేలు ముగ్గురూ ఒకప్పుడు కార్పొరేటర్లే  

బడా రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన నగర పాలక సంస్థలు 

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన చాలామంది నేతలు చట్టసభల వరకు ఎదిగారు. నిరంతర ప్రజాసేవ, క్రమశిక్షణ, నిబ ద్ధతలే సోపానాలుగా క్షేత్రస్థాయి లో పడిన తొలిమెట్టును రాజకీయ పునాదిగా ఉపయోగించుకుని అంచెలంచెలు గా ఎదిగారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాసేవ మొదలుపెట్టిన వారు జాతీయ స్థాయి నేతలుగా, రాష్ట్ర మంత్రులుగా, పార్టీ సారథులుగా, డిప్యూటీ స్పీకర్‌ లాంటి రాజ్యాం గబద్ధ హోదాల్లో పనిచేస్తూ సమకాలీన రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్మన్లుగా పనిచేసిన వారు ఈ జాబితాలో ఉండగా.. మేయర్లు, కార్పొరేట ర్లుగా పనిచేసి చట్ట సభలకు ఎదిగిన వారి గురించి ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల తరుణంలో ఓసారి మన నం చేసుకుందాం.  

క్షేత్రం నుంచి కదిలొచ్చి.. 
క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాలామంది నేతలు చట్టసభలకు ప్రాతిని« ధ్యం వహించడం విశేషం. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ రేణుకా చౌదరి బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా పనిచేశారు. అక్కడి నుంచే రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. అదే కోవలో రాష్ట్ర కేబినెట్‌ వరకు ఎదిగిన నేతలు కూడా నగర రాజకీయాల నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వీరిలో ప్రస్తుత శాసనçసభ ఉపసభాపతి, మాజీ మంత్రి టి.పద్మారావుగౌడ్‌ ఒకరు. ఆయన రెండుసార్లు హైదరాబాద్‌ నగర పాలక సంస్థ పరిధిలోని మోండా డివిజన్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తు త మంత్రి గంగుల కమలాకర్‌ కూడా కార్పొరేటర్‌ నుంచి కేబినెట్‌ వరకు ఎదిగారు. కరీంనగర్‌ నగర పాలక సంస్థలో రెండు సార్లు డివిజన్‌ కార్పొరేటర్‌గా పనిచేసిన గంగుల ఆ తర్వాత ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీసీ సంక్షేమం బాధ్యతలు చూస్తున్నారు.  

కమలాకర్, వినయ్‌భాస్కర్, నరేందర్‌ 
ప్రత్యక్ష ఎన్నికల్లో బల్దియా మేయర్‌గా గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. ఆ తర్వాత ఎమ్మెల్యే గా చట్ట సభల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ధాస్యం వినయ్‌భాస్కర్‌ కూడా ఓరుగల్లు నగర పాలక సంస్థలో కార్పొరేటర్‌ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతు న్నారు. అదే నగరానికి ప్రథమ పౌరుడి గా వ్యవహరిస్తూనే శాసనసభకు ఎన్నికైన నన్నపునేని నరేందర్‌ కూడా ఒకనాటి కార్పొరేటరే. ఆయన ప్రస్తుతం వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అక్బర్‌బాగ్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా రెండుసార్లు ప్రజాసేవ చేశారు. ఆ తర్వాత హుడా చైర్మన్‌గా పనిచేసిన దేవిరెడ్డి ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి అంబర్‌పేట డివిజన్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన కాలేరు వెంకటేశ్‌ ప్రస్తుతం అదే నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ కూడా 3 దశాబ్దాల క్రితం జవహర్‌నగర్‌ కార్పొరేటర్‌గా పనిచేశారు.  

మజ్లిస్‌లో ముగ్గురు.. 
శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన ఎంఐఎంకు  ఏడుగురు ఎమ్మెల్యేలుండ గా అందులో ముగ్గురు కార్పొరేటర్లుగా పనిచేసిన వారే. పత్తర్‌ఘట్టీ కార్పొరేటర్‌గా పనిచేసిన అహ్మద్‌ బలా లా మలక్‌పేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జాఫర్‌ హుస్సేన్‌ మిరాజ్‌ (నాంపల్లి ఎమ్మెల్యే) కూడా కార్పొరేటర్‌గా ఎన్నికై జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. పాతబస్తీ నుంచి కార్పొరేటర్‌గా పనిచేసిన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ (చార్మినార్‌) ప్రస్తుత ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గతంలో డబీర్‌పుర కార్పొరేటర్‌గా పనిచేసిన రియాజుల్‌ హసన్‌ అఫన్‌ది ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా మంగళ్‌హాట్‌ నుంచి కార్పొరేటర్‌గానే రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కూడా గతంలో కార్పొరేటరే. మున్సిపల్‌ చైర్మన్లుగా చేసిన జగ్గారెడ్డి (సంగారెడ్డి ఎమ్మెల్యే), సోమారపు సత్యనారాయణ (రామగుండం మాజీ ఎమ్మెల్యే) లాంటి నేతలు కూడా చట్టసభలకు ఎన్నిక కావడం విశేషం.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top